2024 ఎన్నికల్లో గెలిచి కొడాలి నాని ఆట కట్టిస్తా

 *- 2024 ఎన్నికల్లో గెలిచి కొడాలి నాని ఆట కట్టిస్తా


 *- ప్రజలను మోసం చేయడమే కొడాలి నాని నైజం* 

 *- ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు జూ.ఎన్టీఆర్ ఫొటోలు* 

 *- అవసరం వచ్చినపుడు రంగా ఫొటోలు పెడుతుంటాడు* 

 *- మళ్ళీ గెలిపిస్తే ప్రజల దగ్గర కే. టాక్స్ వసూలు చేస్తాడు* 

 *- ఎన్టీఆర్ వర్ధంతిని విజయవంతంగా నిర్వహించాం*

 *- కలిసికట్టుగా ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం* 

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 


గుడివాడ, జనవరి 20 (ప్రజా అమరావతి): 2024 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కొడాలి నాని ఆట కట్టిస్తానని, నియోజకవర్గ ప్రజలంతా సహకరించాలని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రావి విలేఖర్లతో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడమే ఎమ్మెల్యే కొడాలి నాని నైజమని ఆరోపించారు. ఒకవైపు ఎన్టీఆర్ ఫొటోలు, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు, అవసరం వచ్చినపుడు మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగా ఫొటోలను కూడా ఎమ్మెల్యే కొడాలి నాని పెట్టుకుంటూ వస్తున్నాడన్నారు. గతంలో జరిగిన ఎన్నికలప్పుడు ఇలా ఫొటోలను పెట్టుకుని ప్రజలను మాయ చేయడం అందరం చూశామన్నారు. మంత్రిగా ఉన్న మూడేళ్ళ కాలంలో తన కడుపు, జేబులు నింపుకున్నాడన్నారు. ఏ ఒక్క పేద కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలు నష్టపోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానికి చావుదెబ్బ కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహనరెడ్డి అండ చూసుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.5వేల కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గత 20 ఏళ్ళుగా ఎవరికీ న్యాయం చేయలేదని, గుడివాడ ప్రజలు కూడా ఆలోచన చేయాలన్నారు. హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల్లో ఆస్థులను కూడబెట్టుకున్నాడన్నారు. గుడివాడ మహిళలు కూడా చీత్కరించుకునే పరిస్థితి కూడా రానుందన్నారు. మహిళలంటే అమితమైన ప్రేమాభిమానాలను ఎన్టీఆర్ కనబర్చేవారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా అదేనని తెలిపారు. గత నాలుగేళ్ళుగా రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటివి చూడలేదన్నారు. స్వార్ధం కోసమే రాజకీయాలను వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొడాలి నాని మళ్ళీ ఎన్నికైతే ప్రజల నుండి కే టాక్స్ వసూలు చేస్తాడని చెప్పారు. గుడివాడలో భూకబ్జాలు, సెటిల్ మెంట్ లు చేయలేదా అని ప్రశ్నించారు. జూద కార్యక్రమాలను నిర్వహించడం లేదా అని అన్నారు. కే. టాక్స్ వసూలు చేస్తే ప్రజలను ఎవరు కాపాడతారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలను ఎండగడతానని హామీ ఇచ్చారు. వ్యవస్థలు కూడా సహకరించే పరిస్థితికి వచ్చాయన్నారు. చంద్రబాబు దగ్గర నుండి బీ ఫారం తెచ్చుకుని గెల్చిన తర్వాత ఆయననే దుర్భాషలాడుతున్న కొడాలి నానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కువ కాదని అభిప్రాయపడ్డారు. ఇకనైనా జాగ్రత్త పడాలని వైసీపీ శ్రేణులకు సూచించారు. విజయవాడలోని ప్రతిష్ఠాత్మక హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి రాజశేఖరరెడ్డి పేరు పెట్టారన్నారు. ఆ సమయంలో మాట్లాడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇప్పుడు ఎన్టీఆర్ పై ప్రేమ వచ్చేసిందన్నారు. పది మందిని బైక్ లపై పంపి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను గందరగోళ పర్చేందుకు ప్రయత్నించారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుడివాడలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు అన్ని గ్రామాలు, వార్డుల నుండి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ అనేక కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. పరిపాలనలో కూడా విప్లవాత్మ మార్పులను తీసుకువచ్చారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఎన్టీఆర్ పని చేశారన్నారు. అన్ని వర్గాలను రాజకీయాల్లో భాగస్వాములుగా చేశారన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి ఎన్టీఆర్ చేసిన కృషి కారణమన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉంటూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని మాజీ ఎమ్మెల్యే రావి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు దింట్యాల రాంబాబు, వాసే మురళి, పోలాసి ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Comments