మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 4వేల ఫిష్ ఆంధ్రా హబ్ లు
- సచివాలయంలో ఆక్వా ఎంపవరింగ్ కమిటీ సమావేశం

- సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వి.రఘురాం- మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 4వేల ఫిష్ ఆంధ్రా హబ్ లు


- రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల వినియోగంకు ప్రోత్సాహం

- అన్ని ప్రముఖ నగరాల్లో ఆక్వా ఫుడ్ ఫెస్టివల్స్

- అంతర్జాతీయ మార్కెట్ తో పాటు దేశీయ మార్కెట్ పైనా దృష్టి

- ఇతరరాష్ట్రాల్లోనూ ఆంధ్రా ఫిష్ హబ్ ల ద్వారా విక్రయాలు

- ఆక్వా సాధికారిత కమిటీ ద్వారా సీడ్, ఫీడ్ రేట్ల స్థిరీకరణకు చర్యలు

- అర్హత ఉన్న ప్రతి ఆక్వారైతుకు విద్యుత్ సబ్సిడీ 

- ఆక్వారంగంను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రత్యేక చర్యలు


: మంత్రుల కమిటీ


అమరావతి (ప్రజా అమరావతి):


1) సచివాలయంలోని మూడోబ్లాక్ లో సోమవారం ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ సీదిరి అప్పలరాజు,  అప్సడా వైస్ చైర్మన్ వి.రఘురాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఇంధనశాఖ)  కె.విజయానంద్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ప్రవీణ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు. 


2) ఈ సందర్బంగా సాధికారిత కమిటీ ద్వారా ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అంశాలపై కమిటీ సమీక్షించింది. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగంను బలోపేతం చేసేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆక్వా సాధికారిత కమిటీ ద్వారా ఆక్వారంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు, రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆక్వా రైతులకు అండగా నిలవడం, సీడ్, ఫీడ్ రేట్లను శాస్త్రీయంగా నిర్ణయించడం, ధరల స్థిరీకరణ వంటి అంశాల్లో సాధికారిత కమిటీ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. 


1.3) రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల హెక్టార్ లలో ఆక్వా సాగు జరుగుతోందని అన్నారు. ఈ-ఫిష్ సర్వే ఆధారంగా ఈ రంగంపై మొత్తం 1.38 లక్షల మంది రైతులు ఆధారపడి  ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.27 ఎంటిల ఆక్వా ఉత్పత్తులను నిల్వ చేసేందుకు 111 కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆక్వాలో కనీసం 30 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. ఇందుకోసం సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ఫిష్ ఆంధ్రా హబ్ లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశించారని అన్నారు. వచ్చే మార్చి నెలాఖరు నాటికి మొత్తం 4వేల హబ్ లను ఏర్పాటు చేయాలని, ఈ మేరకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ హబ్ లకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై) కింద సబ్సిడీతో కూడిన రుణాలను కూడా అందించేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. 


4) ఇప్పటికే ఈక్విడార్, బ్రెజిల్ వంటి దేశాలతో పోటీ పడుతూ మనదేశం నుంచి ఎపి ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారని అన్నారు. దీనికి తోడుగా డొమెస్టిక్ వినియోగంను కూడా పెంచుకోవాలని సూచించారు. ఒరిస్సా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఆక్వా స్థానిక అవసరాలకు సరిపోతోందని అన్నారు. దీనివల్ల పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ పైనే ఆధారపడి, ఒడిదొడుకుల సమయంలో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలను మెరుగుపరుచుకునే వీలవుతుందని అన్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని, దేశీయ మార్కెట్ అవకాశాలను ప్రోత్సహించాలని కోరారు. 


5) ఆక్వాసీడ్, ఫీడ్ రేట్లు పెరగకుండా ఎప్పటికప్పుడు ఫిషరీస్ అధికారులు సీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లతో జరుపుతున్న చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రులు పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఈ రేట్లను నియంత్రణలోకి తీసుకువచ్చామని, అదే క్రమంలో ఆక్వా ఉత్పత్తుల ధరలు పతనం కాకుండా అడ్డుకట్ట వేయగలిగామని అన్నారు. రైతుల్లోనూ అంతర్జాతీయ మార్కెట్లు, ధరలపై అవగాహన కల్పించడం ద్వారా ఆక్వా సాగు కూడా హేతుబద్దమైన విస్తీర్ణంలోనే జరిగేలా చూడాలని అన్నారు. డిమాండ్, సప్లయి అంశాల్లో నిర్ధిష్టమైన అవగాహన లేకపోతే అంతిమంగా రైతులే నష్టపోతారని అన్నారు. ఇప్పటికే ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల్లో ప్రదర్శించడం ద్వారా రైతుల్లో రేట్లపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్, ఫీడ్ తయారీదారులు కూడా సహకరిస్తున్నారని అన్నారు. ఆక్వా సమస్యలపై ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్ గా పరిగణించాలని కోరారు. 


6) ఆక్వా రైతులకు చేయూత అందించేందుకు ఆక్వాజోన్ పరిధిలో పది ఎకరాల విస్తీర్ణం లోపల సాగుచేసే వారికి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని అందిస్తోందని మంత్రులు అన్నారు. తాజాగా ఆక్వాజోన్ లోపల, వెలుపల సాగవుతున్న విస్తీర్ణంను గుర్తించేందుకు మత్స్యశాఖ నిర్వహిస్తున్న సర్వే వచ్చే నెలాఖరు నాటికి పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికే 26వేల కనెక్షన్ లకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని అందిస్తోందని అన్నారు. ఈ సర్వే ద్వారా ఆధార్ తో ఆక్వారైతుల వివరాలు అనుసంధానం అవుతాయని, ఖచ్చితంగా ఎంతమంది అర్హులైన రైతులు ఉన్నారో నిర్ధిష్టంగా తెలుస్తుందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీని అందించాలని సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్ధేశించారని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 


6) ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ (ఇంధనశాఖ) కె.విజయానంద్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, కమిషనర్ & డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments