విజయవాడలో 5వ నాబార్డ్ క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించిన మంత్రి విడదల రజిని..



విజయవాడ (ప్రజా అమరావతి);



*విజయవాడలో 5వ నాబార్డ్ క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించిన మంత్రి విడదల రజిని..*


 

హస్తకళలు, చేనేత, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయానికి ‘నాబార్బ్ క్రాఫ్ట్స్ మేళా-2023’ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. విజయవాడ పటమటలోని మేరి స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నాబార్డ్ ఆధర్వంలో 3 జనవరి నుండి జనవరి 12 వరకూ నిర్వహించే 5వ నాబార్డ్ క్రాఫ్ట్స్ మేళా ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రాఫ్ట్ట్ మేళాలో మొదటి కొనుగోలుగా హస్త కళాకారులు చెక్కతో తయారుచేసిన జాతీయ పతాకాన్ని మంత్రి కొనుగోలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. గ్రామీణ చేతివృత్తుల వారికి మార్కెట్ మద్దతు ఏర్పాటుకు నాబార్డ్ చేస్తున్న కృషికి సంతోషాన్ని వ్యక్తం చేశారు. వివిధ మార్కెట్ అవసరాలతో తమ ఉత్పత్తులను చక్కగా తీర్చిదిద్దుకోవాలని, మేళాకు హాజరయ్యే ఇతర కళాకారుల నుండి ఉత్తమ పద్ధతులను నేర్చుకోవాలని ఆమె కళాకారులకు సలహా ఇచ్చారు. నాబార్డు సహకారంతో విజయవాడలో పెద్ద ఎత్తున మేళాను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేళాలో 12 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు, చేతి వృత్తిదారులు వచ్చి దాదాపు 60 నుంచి 70 వరకూ స్టాల్స్ ఏర్పాటు చేశారన్నారు. వివిధ హస్తకళలు, చేనేత వస్త్రాల కళాకారులతో పాటు గ్రామీణ మహిళల ఉత్పత్తులను ప్రదర్శించడానికి, వాటిని సరసమైన ధరలకు విక్రయించడానికి రాష్ట్రప్రభుత్వం, నాబార్బ్ ప్రోత్సహిస్తుందన్నారు. ఈ అపురూప హస్త కళాకృతులను వీక్షించి, కొని చేతివృత్తుల అభివృద్ధిని ప్రొత్సహించండని మంత్రి పిలుపునిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్. గోపాల్ మాట్లాడుతూ.. వివిధ హస్తకళా కార్యక్రమాలలో జీవనం కొనసాగిస్తున్న వ్యక్తుల ప్రయోజనం కోసం నాబార్డ్ చేపడుతున్న ప్రదర్శన,  ఇతర కార్యకలాపాల ఉద్దేశాలను వివరించారు. వినియోగదారుడి అభిరుచులకు అనుగుణంగా తమ ఉత్పత్తులను మెరుగుపరిచేందుకు తగిన అభిప్రాయాన్ని తీసుకోవాలని ఆయన హస్తకళాకారులకు సూచించారు. విజయవాడలోని ప్రీమియర్ మాల్‌లో కళాకారులు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న నాబార్డ్ స్టాల్-ఇన్-మాల్ కు కూడా విశేష స్పందన వస్తుందని తెలిపారు. 

ఈ మేళాలో పొందూరు, వెంకటగిరి, మంగళగిరి, పోచంపల్లి, మహేశ్వరి(మధ్యప్రదేశ్), కలంకారి, కొండపల్లి, ఏటికొప్పాక, తిరుపతిలోని చెక్క బొమ్మలు, యూపీకి చెందిన గాజు ఉత్పత్తులు, లెదర్ తోలుబొమ్మలు, జూట్ బ్యాగులు, వంటి ఉత్పత్తులను ప్రదర్శించే 65 స్టాళ్లను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు తెలంగాణ నుండి ఆభరణాలు, అలంకార వస్తువులు మరియు ఇతర ఉత్పత్తులు ఆకర్షణగా నిలుస్తున్నాయి. .

ఈ కార్యక్రమంలో అప్కాబ్ పర్సన్ ఇన్ ఛార్జ్ ఎం. జాన్సీరాణి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల సంస్థ చైర్మపర్సన్ విజయలక్ష్మి, గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (జీడీసీసీ) చైర్మన్ ఆర్. రామాంజనేయులు, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, నాబార్డ్ జనరల్ మేనేజర్ ఎన్.ఎస్. మూర్తి, హైదరాబాద్ డీజీఎం కె.వి.ఎస్. ప్రసాద్, విజయవాడ డీజీఎం ఎం.ఎస్.ఆర్. చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.  



Comments