సాగునీటి కాలువ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్



*సాగునీటి కాలువ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్*



పార్వతీపురం/మక్కువ, జనవరి 10 (ప్రజా అమరావతి): వెంగళరాయ సాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ఆధునీకరణ లైనింగ్ పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  పరిశీలించారు. మక్కువ మండలం చెముడు గ్రామం వద్ద కాలువ లైనింగ్ పనులను, సాలూరు మండలం లక్ష్మీపురం వద్ద హెడ్  వర్క్స్ పనులను  మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల పరిధిలోని సుమారు 16,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ వద్ద నున్న ఆక్విడక్ట్ ద్వారా ఎంత మేర సాగునీరు అందినది, ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. సుమారు 2.05 కిలోమీటర్ల ఆక్విడక్ట్ తో ఆయా ఆయకట్టుకు సాఫీగా సాగునీటి సౌకర్యం ఉండేదని, ఆక్విడక్ట్ మరమ్మతులకు గురి కావడంతో సాగునీటికి కొంతమేర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కాలువ లైనింగ్ పనులతో పాటు నూతన ఆక్విడక్ట్ నిర్మాణం చేపట్టాలని, శివారు ప్రాంతం ప్రతీ సెంటు భూమికి కూడా సాగునీటి సౌలభ్యం కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వెంగళరాయ సాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు విస్తీర్ణం, నీటి సామర్థ్యం తదితర విషయాలను మ్యాప్ ద్వారా  అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం హెడ్ సప్లైస్, స్పిల్ వే, గేట్లు, సైరన్ పనితీరును పరిశీలించారు.


ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్. అప్పలనాయుడు, డి ఈ సురేష్, జే ఈ ఈ లు శ్రీనివాసు, జగదీష్, రాజశేఖర్, ప్రశాంత్, బి.తిరుపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.స్వాతి, ఏ ఎస్ ఐ బి.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.

Comments