విద్య, వ్యవసాయం తోనే అభివృద్ధి సాధ్యం - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి.


అదిలాబాద్ జిల్లా (ప్రజా అమరావతి);



 *ప్రతి ఒక్కరికి విద్యే ప్రధానం.* 


 *విద్య, వ్యవసాయం తోనే అభివృద్ధి సాధ్యం - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి.


*


 *యువత చెడు అలవాట్లకు,వ్యసనాలకు దూరంగా ఉండాలి.*


 *విద్య యువత కు మంచి భవిష్యత్తును సాధించిపెడుతుంది.* 


 *ఉట్నూర్ పోలీసుల అధ్వర్యంలో ఉట్నూర్ మండలం న్యూ కోలాం గూడా గ్రామం లో దుప్పట్ల పంపిణీ.* 


 *500 కోలాం గిరిజనులకు దుపట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ.*


బుధవారం ఉట్నూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఉట్నూరు మండలం న్యూ కోలాంగూడ గ్రామం నందు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ గ్రామం  ఆదివాసీలలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కోలాం గిరిజనులకు సంబంధించినది. ఈ గ్రామం నందు సుమారు 500 బ్లాంకెట్లు గ్రామ ప్రజలకు జిల్లా ఎస్పీ అందజేశారు. మొదటగా గ్రామ ప్రజలు ఆదివాసి డప్పు వాయిద్యాల నడుమ జిల్లా ఎస్పీకి స్వాగతం పలికి, అల్లంపల్లి చిన్న జీయర్ స్వామి ఆశ్రమ విద్యార్థులచే చక్కటి ఆంగ్ల పదజాలంతో జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలలో కోలాం గిరిజనులు అభివృద్ధి చెందాలంటే యువత చిన్నతనం నుండి మంచి విద్యను అభ్యసించాలని తెలిపారు, లేనియెడల నూతన పద్ధతులను ఉపయోగిస్తూ మంచి వ్యవసాయాన్ని చేయాలని, అలాగే వ్యాపార రంగాన్ని నిర్వహించాలని తెలిపారు. విద్య వల్లే తమ కుటుంబాలకు అభివృద్ధిని సాధించవచ్చని, గ్రామం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, అలవాట్లకు దూరంగా ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న విద్యను ప్రతి ఒక్కరు చిన్నతనం నుండి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. గ్రామంలోని ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు ప్రభుత్వ వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని, ఇంటి వద్ద ఉండటం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుందని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబం నుండి ఉన్న పిల్లలు తప్పనిసరిగా విద్యను అభ్యసించాలని కోరారు. యువత ఖాళీగా ఉండకుండా వ్యవసాయాన్ని గానీ, వ్యాపారాన్ని గాని చేస్తూ తమ  గ్రామానికి ఆదర్శంగా ఉండాలన్నారు. ఇతర అభివృద్ధి చెందిన జాతులను చూసి మనం చేసే తప్పులను సరిదిద్దుకుంటూ, అందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కొలాం గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. మంచి ఆహార అలవాట్లను పాటిస్తూ సమయానుసారంగా భోజనం తీసుకుంటూ, చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి పద్ధతులను అవలంబించాలని తెలియజేశారు. యువతకు ఏదైనా ఒక ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికోసం నిరంతరం కష్టపడాలని మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక కళావేదిక తరపున కళాకారులు రోడ్డు ప్రమాదాలను జరుగుతున్న తీరుపై, చెడు వ్యసనాలను మూఢనమ్మకాలను విడిచిపెట్టాలని తమ పాటల ద్వారా కళా ప్రదర్శనను అందించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సిఐ ఐ సైదారావు, ఎస్సై భరత్ సుమన్, కోలాం సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం శేషారావు, గ్రామ సర్పంచి ఆత్రం రాహుల్, గ్రామ పటేల్ రాజు, ఉపసర్పంచి సిద్ధం గంగారం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments