ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ అర్చకుల, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డు ఏర్పాటు

 *ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ అర్చకుల, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డు ఏర్పాటు


*

*•ఆగమ సలహా బోర్డు చైర్మన్ మరియు 12 మంది సభ్యుల నియామకం*

*•కామన్ గుడ్ ఫండ్ (సి.జి.ఎఫ్.) రూ.249.26  కోట్లతో దేవాలయాల అభివృద్ది*

*•రూ.70 కోట్ల పనులు పూర్తి, మిగిలిన రూ.180 కోట్లు పనులు టెండర్ల దశలో ఉన్నాయి*

*•పీఠాధిపతులు, మఠాధిపతుల విశిష్ట సదస్సు నిర్వహణకు తేదీలు త్వరలో ఖరారు*

*ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*

                                                                                                                                                                                      అమరావతి, జనవరి 10 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ అర్చకుల, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ  జి.ఓ.ఆర్టి.నెం.43 ను  రాష్ట్ర ప్రభుత్వం  మంగళవారం జారీచేసినట్లు ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమార్థం సంక్షేమ నిధి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సాధారణ పరిపాలనా విభాగం ప్రిన్సిఫల్ సెక్రటరీ చైర్మన్ గా వ్యవహరించే ఈ బోర్డులో నలుగురు అధికారులను, ముగ్గురు అనధికారులను సభ్యులుగాను మరియు దేవాదాయ శాఖ కమిషనర్ సెక్రటరీ & ట్రెజరర్ గాను ప్రభుత్వం నియమించినట్లు ఆయన తెలిపారు. రెవిన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ, టి.టి.డి. ఇ.ఓ., టి.టి.డి. ఆర్థిక సలహాదారు & చీఫ్ ఎక్కౌంట్స్ ఆఫీసర్ ను అధికార సభ్యులుగా మరియు  కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన ఏ.పి. అర్చక సమాఖ్య ప్రతినిధి ఏ.ఆత్రేయ బాబు, కర్నూలు జిల్లా కోటపాడుకు చెందిన ఏ.పి. అర్చక సమాఖ్య ప్రతినిధి పి.శ్రీనివాసులు మరియు ఏ.పి. హిందూ దేవాదాయ, ధర్మాదాయ సంస్థల సిబ్బంది సంఘం ప్రతినిధి  వి.శ్రీనివాస్ ను అనధికార సభ్యులుగా ఈ ట్రస్టు బోర్డులో నియమించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.  అనధికార సభ్యులు పదవి చేపట్టిన తేదీ నుండి  మూడేళ్ల పాటు  ఈ బోర్డులో సభ్యులుగా కొనసాగుతారని ఆయన తెలిపారు. 


*ఆగమ సలహా బోర్డు చైర్మన్ మరియు 12 మంది సభ్యులు నియామకం……*


  రాష్ట్ర ధార్మిక పరిషత్ రెండో సమావేశం అమరావతి సచివాలయం రెండో బ్లాక్  సమావేశ మందిరంలో మంగళవారం జరిగిందని, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగమ సలహా బోర్డుకు చైర్మన్ ను మరియు  12 ఆగమాలకు సంబంధించి 12 మంది సభ్యులను నియమించడం జరిగిందని  ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బ్రహ్మర్షి విద్యా వారధి వైఖానన ఆగమ ప్రవర  డా.వేదాన్తం సత్య శ్రీనివాస అయ్యంగార్ ను ఈ బోర్డుకు చైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. సంస్కృత పండితులు మహా మహోపధ్యాయ ఆచార్య దోర్బల ప్రభాకర్ శర్మ, దాత్తద శ్రీ వైష్ణవ ఆగమానికి చెందిన పి.కృష్ణమాచార్యులు, వీరశైవ ఆగమానికి చెందిన నందుల మఠం శశిభూషణ సిద్దాంది, శాక్తేయ ఆగమానికి చెందిన బొద్దుపల్లి దత్తాత్రేయ శర్మ, శైవాగమ శాస్త్ర పండితులు మృత్యంజయ శర్మ, వైఖానస ఆగమానికి చెందిన ఖండవల్లి సూర్య నారాయణాచార్యులు, స్మార్త వైదికాగమానికి చెందిన కళ్లేపల్లి సుబ్రహ్మణ్యం, వాస్తు, జ్యోతిష్యం పండితులు బుట్టే వీరభద్ర సిద్దాంతి, తంత్ర సారంకు చెందిన అక్కి రాఘవేంద్రాచార్య, పాంచరాత్రంకి సంబందించి ఆర్.ఆర్.వి.గోపాలాచార్యులు, వైదికంకు చెందిన జె.కె.సుబ్బారావు మరియు గ్రామ దేవతకు సంబంధించి వారణాసి నాగభూషణం ను సభ్యులుగా ఈ బోర్డులో నియమించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 

                                                                                                                                                                                           *కామన్ గుడ్ ఫండ్ (సి.జి.ఎఫ్.) రూ.249.26  కోట్లతో దేవాలయాల అభివృద్ది……*

                                                                                                                                                                                      దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని పలు  దేవాలయాలను సి.జి.ఎఫ్. నిధులతో అభివృద్ది పర్చేందుకు రూ.249.26 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు పర్చడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇందులో  రూ.70 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని, మిగిలిన రూ.180 కోట్లుకు సంబందించిన పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక వర్గాల్లోని దేవాలయాలను అభివృద్ది పర్చేందుకు  ఈ నిధులను వెచ్చిస్తున్నామని, అయితే మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ గా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు  20 శాతంగాను, మిగిలిన జిల్లాలకు 33 శాతంగాను నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు.  ఈ అభివృద్ది పనులను అన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ అధికారులకు లక్ష్యాలను నిర్థేశించి ప్రతి పదిహేను   రోజులకొకసారి ఈ పనుల ప్రగతిని సమీక్షించడం జరుగుచున్నదని, ఫలితంగా ఈ పనుల్లో మంచి పురోగతి కనిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. 


*హిందూ మత ధర్మ ప్రచారానికి త్వరలో విశిష్ట సదస్సు……..*

                                                                                                                                                                                        హిందూ మత ధర్మంపై విస్తృతమైన ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో పీఠాధిపతులు, మఠాధిపతుల విశిష్ట సదస్సును  రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలో త్వరలో నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.  ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ఖరారు చేయడం జరుగుతుందన్నారు. 

                                                                                                                                                                                           

Comments