*- యువగళం పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే రావి*
*- కుప్పంలో నారా లోకేష్ తో కలిసి అడుగులు*
*- గుడివాడ నుండి తరలివెళ్ళిన టీడీపీ శ్రేణులు*
*- పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్న రావి*
కుప్పం, జనవరి 27 (ప్రజా అమరావతి): యువగళం పాదయాత్రలో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కుప్పంలో శుక్రవారం ప్రారంభమైన ఈ పాదయాత్రలో నారా లోకేష్ తో కలిసి రావి అడుగులు వేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ వేసే మొదటి అడుగులో భాగస్వాములయ్యేందుకు గుడివాడ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే రావి నాయకత్వంలో టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్ళాయి. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తొలిరోజు పాదయాత్ర ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైందన్నారు. ముఖ్యంగా యువత ఈ పాదయాత్రకు సంఘీభావంగా పెద్దఎత్తున తరలిరావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పాదయాత్ర తనకెంతో స్పూర్తిని కల్గించిందన్నారు. ఇదే స్పూర్తితో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకునే దిశగా నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్వహిస్తున్నారని చెప్పారు. కుప్పంలో అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు, యువత ఈ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారన్నారు. సమస్యలను తెలుసుకుంటూ నారా లోకేష్ ముందుకు సాగుతున్నారన్నారు. 400 రోజుల పాటు దాదాపు 4వేల కిలోమీటర్ల మేర జరిగే యువగళం పాదయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమవుతుందని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధించడమే నారా లోకేష్ లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు విజన్ ను నారా లోకేష్ ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరించనున్నారని తెలిపారు. పాదయాత్రలో వచ్చిన ప్రజల సమస్యలను వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పరిష్కరించకపోతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారని తెలిపారు. గత నాలుగేళ్ళుగా అన్నివర్గాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోందన్నారు. రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలకు ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని, యువగళం పాదయాత్రకు అంతకు మించిన ఆదరణ రానుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నారా లోకేష్ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు ఎక్కడదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోనే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ ఎమ్మెల్యే రావి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, గోకవరపు సునీల్, గోవాడ శివ, సయ్యద్ జబీన్, పండ్రాజు సాంబశివరావు, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment