*వేమన పద్యాలు ఆధునిక పరిశోధనలకు ఆధారం
*
*జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
*ఘన నివాళులర్పించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు
విజయనగరం, జవనరి 19 (ప్రజా అమరావతి) ః సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా తేలికైన పదజాలంతో రచించిన వేమన పద్యాలు ఎన్నో ఆధునిక పరిశోధనలకు ఆధారం కావటం శ్లాఘనీయమని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఆటవెలది చందంలోనే పద్యాలను రచించి లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో.. చక్కటి ఉదాహరణలతో హృదయానికి అత్తుకునేలా వేమన తన భావాన్ని ప్రజలకు చెప్పారని కీర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో యోగి వేమన జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ ఇతర అధికారులు ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేమన విగ్రహారాధనకు, కులాలకు, మతాలకు అతీతమని అయన అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని కీర్తించారు. ఆయన రచించిన ఎన్నో పద్యాలు నేటి ఆధునిక యుగంలో చేపడుతున్న పరిశోధనలకు ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని రకాల సమాజ పరిస్థితులకు అద్దం పట్టేలా వేమన పద్య రచనలు సాగాయని, ఇలాంటి కవి ఉండటం తెలుగు ప్రజలకు గౌరవప్రదమని కొనియాడారు. నేటి తరం పిల్లలకు వేమన పద్యాలను తప్పకుండా నేర్పించాలని పాఠశాలలకు దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలని డీఈవోకు సూచించారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోడానికి వేమన పద్యాలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
*విజేతలకు బహుమతులు*
వేమన జయంతిని పురస్కరించుకొని విద్యాశాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్య పఠన పోటీల్లో సీనియర్స్ విభాగంలో గంట్యాడ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న వి. నవ్యశ్రీ ప్రథమ స్థానం, విజయనగరంలోని జీఎంఆర్ ఎస్.కె.టి. హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న జి. ప్రసాదు ద్వితీయ స్థానం, డెంకాడ నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో 9వ చదువుతున్న కె.వి.ఎం. చైతన్య తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. అలాగే జూనియర్స్ విభాగంలో కొత్తవలస మండలం చినరేవుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సీహెచ్. చరణ్య, కె. హిందు కుమార్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో, డెంకాడ నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న ఆర్. జోహన్ అనే విద్యార్థి తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి జిల్లా కలెక్టర్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా జ్ఞాపికలు, ధృవపత్రాలు అందజేశారు.
వేడుకల్లో కలెక్టర్‌తో పాటు రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment