జీవనోపాధుల మెరుగుదల కోసం యువకులకు శిక్షణలురూ.11.50 కోట్లతో రెండు పాదరక్షల తయారీ కేంద్రాల నిర్మాణం

ప్రకృతి వ్యవసాయం చేసే ఎస్సీ రైతులకు సాయం

జీవనోపాధుల మెరుగుదల కోసం యువకులకు శిక్షణలు


మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి.

అమరావతి, జనవరి 31 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే ఎస్సీ రైతులకు, యువకులకు వివిధ కార్యక్రమాల్లో శిక్షణలతో పాటు వారి జీవనోపాధుల మెరుగుదలకు సహాయాన్ని అందించనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. లిడ్ క్యాప్ ద్వారా రెండు పాదరక్షల (ఫుట్ వేర్) తయారీ కేంద్రాలను రూ.11.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్నామని వెల్లడించారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సాయంతో అమలు చేస్తున్న పథకాల ప్రగతిని మంత్రి సమీక్షించారు. ఎన్.ఎస్.ఎప్.డి.సి, పీఎం అజయ్ పథకాల కింద చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సాయంతో లిడ్ క్యాప్ ద్వారా చేపడుతున్న పనుల్లో భాగంగా ప్రకాశం జిల్లా, రాచర్ల మండలంలోని యడవల్లి, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామాల వద్ద ఒక్కొక్కటి రూ.5.75 కోట్ల వ్యయంతో పాదరక్షల తయారీ కేంద్రాలను నిర్మించడానికి సన్నాహాలు పూర్తయ్యాయని తెలిపారు. లిడ్ క్యాప్ ద్వారానే 300 మంది యువకులకు రూ.కోటి వ్యయంతో చర్మవస్తువుల తయారీలోనూ శిక్షణలు ఇవ్వనున్నామని చెప్పారు. పీఎం అజయ్ పథకంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేసే ఎస్సీ రైతుల్లో 29,272 మందికి కూడా సాయం చేయనున్నామని నాగార్జున తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే ఎస్సీ రైతులకు వారి వ్యవసాయానికి ఎక్కువ కాలం ఉపయోగపడే విధంగా అవసరమైన కిట్లను అందించాలని ప్రతిపాదన ఉందన్నారు. దీనితో పాటుగా బహుళ పంటలు వేసుకోవడానికి, పెరటి తోటలను పెంచుకోవడానికి  కావాల్సిన విత్తన కిట్లు ఇవ్వాలని కూడా ప్రతిపాదించడం జరిగిందన్నారు. కూరగాయల పెంపకం, దేశీ ఆవుల పెంపకం, సేంద్రీయ ఎరువుల దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహకారం అందించే విషయం కూడా పరిశీలనలో ఉందని, వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలకే సాయం చేయనున్నామని వెల్లడించారు. రైతు సాధికారిత సంస్థ, స్త్రీనిధి సంస్థల సహకారంతో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఏ విధమైన సాయం అందిస్తే వారికి ఎక్కువ మేలు జరుగుతుందనే విషయం గురించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా నాగార్జున అధికారులను ఆదేశించారు. ఈ పథకంలో భాగంగానే 5024 మంది యువకులకు శిక్షణలు కూడా ఇవ్వాలని  నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోషియల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.జయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ వీసీఎండి చిన్నరాముడు, జీఎం సునీల్ రాజ్ కుమార్, రైతుసాధికారత సంస్థ సిఇఓ రామారావు, స్త్రీనిధి సంస్థ ఎండీ నాంచారయ్య, లిడ్ క్యాప్ ఎండీ డోలా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments