విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం



నెల్లూరు, జనవరి 28 (ప్రజా అమరావతి): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం


లో వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని, ఆ దిశగా రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ ఫెయిర్ లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


శనివారం ఉదయం నెల్లూరు నగరంలోని దర్గామిట్ట జిల్లాపరిషత్ బాలుర హైస్కూల్లో జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, మేయర్ స్రవంతితో కలిసి మంత్రి ప్రారంభించారు. 


 తొలుత జడ్పీ హైస్కూల్ కి విచ్చేసిన మంత్రి, కలెక్టర్, మేయర్ కు విద్యార్థులు స్వాగత నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ మండల స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. సైన్స్ కు సంబంధించిన పరిశోధనలు విస్తృతంగా జరగాలని, ఆ ప్రయోజనాలు మానవాళికి అందాలని, ఆ దిశగా సరికొత్త ఆవిష్కరణలకు విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. ఆధునిక, సాంకేతిక రంగాల్లో భారతదేశం అద్భుత ఫలితాలు సాధిస్తుందని, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కూడా వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువవుతుందని, కలుషితమైన వాతావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. విద్యార్థులందరూ సైన్స్ ఫెయిర్ లో మొక్కుబడిగా కాకుండా ఆసక్తితో ఉత్సాహంగా పాల్గొని సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారని, నాడు నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, ట్యాబ్ ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలతో విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని చెప్పారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగిజావను అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం శుభపరిణామమని, విద్యా వ్యవస్థ గురించి ఇంత గొప్పగా ఆలోచన చేసే ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డేనని మంత్రి పేర్కొన్నారు. 


 జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, ఇతర దేశాల కంటే మనం ఏమాత్రం తక్కువ కాదని, అన్ని రంగాల్లో మన దేశం అభివృద్ధి పథంలో ముందంజలో ఉందన్నారు.  సైన్స్ ఫెయిర్లలో బహుమతులు పొందడం కంటే పాల్గొనడం చాలా ముఖ్యమని, ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలన్నారు. రోజువారి మానవ జీవితంలో సైన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని, సైన్స్ గొప్పతనాన్ని తెలుసుకొని విద్యార్థులందరూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. 

 అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించి, వాటి వివరాలను మంత్రి, కలెక్టర్ అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. 

 పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖగోళ దర్పణాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు సందర్శించారు. 

  మండల స్థాయిలో ఎంపికైన 186 ప్రదర్శనలను ఈ సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికవుతారని జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 

 ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సేవాదళ్ అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విద్యాశాఖ ఆర్జేడీ సుబ్బారావు, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, పాఠశాల హెచ్ఎం జయమ్మ, జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు. 



Comments