శబరిమలలో మకరజ్యోతి దర్శనం .. అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన గిరులు


 *శబరిమలలో మకరజ్యోతి దర్శనం .. అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన గిరులు*


అయ్యప్ప స్వాములు, భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం రానే వచ్చింది. భక్తులకు నక్షత్రంలా మెరుస్తూ మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. భక్తులకు శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేసింది. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకరజ్యోతి దివ్య దర్శనం జరిగింది. జ్యోతి దర్శనం కోసం అక్కడికి చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. అరుదైన దృశ్యాన్ని చూసి స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో ఉప్పొంగిపోయారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణుఘోషతో శబరిగిరులు మారుమోగుతుండగా.. మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. 


ప్రతి సంవత్సరం శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని ప్రజల నమ్మకం. అయితే ఈ సంవత్సరం కూడా భక్తులకు జ్యోతి దర్శన భాగ్యం లభించింది. ఈ క్రమంలో భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్పను పూజించారు. ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్నారు. శబరిమలకు 4కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు నుంచి జ్యోతి దర్శనం కలిగింది. సముద్రానికి 914 మీటర్ల ఎత్తులో శబరిమల ఉంది. 


ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. కాబట్టి నేటి నుంచే దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఈ రోజు నుంచే మకర సంక్రాంతి జరుపుకుంటారు. అయితే మరికొన్ని చోట్ల మాత్రం మాత్రం జనవరి 15న అంటే రేపు సంక్రాంతిని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఇదే క్రమంలో శబరిమల అయ్యప్ప దేవుడి మకరజ్యోతి కూడా భక్తులకు దర్శనం ఇచ్చింది. శబరిమల ఆలయాన్ని మకరజ్యోతి దర్శనం రోజున లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సందర్శిస్తారు. ఇకపై శబరిమల ఆలయాన్ని సందర్శించలేని వారు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమ్, మకరవిళక్కు ఉత్సవ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కూడా చూడొచ్చు. అయితే ఈ జ్యోతిని దర్శించుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. 


ప్రతి సంవత్సరం మకర జ్యోతి కనిపిస్తుంది. అయితే అక్కడి ప్రజలు దీనినే మకరవిళక్కు వార్షిక పండుగ అని అంటారు. ఈ వార్షిక ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటారు. ఈ జ్యోతిని దర్శించుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తు స్వామి వారిని పూజా కార్యక్రమాలు చేసి జ్యోతిని దర్శించుకుంటారు. సాయంత్రం తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకున్నారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు వారికి స్వాగతం పలికి వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరించారు. అనంతరం పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి ఇరుముడి సమర్పించి స్వాములు ఆధ్యాత్మికానందాన్ని పొందారు


అయ్యప్ప భక్తులు మండలకాలంపాటు దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకున్నారు. పంబాన నదిలో స్నానం ఆచరించి రాళ్లదారుల్లో, అడవి మార్గంలో నడిచి సన్నిధానాన్ని చేరుకున్న స్వాములు.. శబరిగిరీశుని జ్యోతి దర్శన భాగ్యం కావడంతో తరించిపోయారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు కేరళలోని శబరిమల ఆలయంలో యాత్రికులు అధిక సంఖ్యలో పూజించే నక్షత్రం. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప దేవుడు తనను తాను మకర జ్యోతిగా చెప్పుకుంటాడని భక్తులు నమ్ముతారు.

Comments