నారా లోకేష్ యువగళం యాత్ర విజయవంతం కావాలి.

 *- నారా లోకేష్ యువగళం యాత్ర విజయవంతం కావాలి* 


 *- టీడీపీ శ్రేణులతో కలిసి సర్వమత ప్రార్థనలు* 

 *- సైకో పాలన పోయి సైకిల్ పాలన రానుంది* 

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* గుడివాడ, జనవరి 26 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. గురువారం గుడివాడలో టీడీపీ శ్రేణులతో కలిసి సర్వమత ప్రార్థనలు చేశారు. స్థానిక మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో 1,116 కొబ్బరికాయలను కొట్టారు. మసీదు, చర్చిల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలాగే గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు గ్రామంలో ఉన్న శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి 1,116 కొబ్బరికాయలను సమర్పించుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం యువతను దారుణంగా మోసం చేసిందన్నారు. 2. 30లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. విదేశీ విద్య పథకాన్ని రద్దు చేయడం వల్ల యువత తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి కొత్త కంపెనీలు రావడం లేదన్నారు. ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం నుండి తరలిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు ఈ నెల 27వ తేదీ నుండి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఈ పాదయాత్ర ద్వారా అన్నివర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం స్పందించకుంటే టీడీపీ అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందన్నారు. యువగళం పాదయాత్ర 400రోజుల పాటు దాదాపు 4వేల కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు విజన్ ను ముందుకు తీసుకువెళ్ళేందుకు ఈ యువగళం పాదయాత్ర ఒక వేదిక కానుందని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలపై విపరీతమైన భారాలు మోపారన్నారు. లిక్కర్, శాండ్, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచారని, నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్నంటాయన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రానుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత దగ్గరవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళామన్నారు. యువగళం పేరుతో నారా లోకేష్ చేపడుతున్న పాదయాత్ర కూడా కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కానుందన్నారు. ముఖ్యంగా యువత యువగళం పాదయాత్రలో భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే రావి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దింట్యాల రాంబాబు, ముళ్ళపూడి రమేష్ చౌదరి, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, కంచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments