మినీ బ్రహ్మోత్సవాలకు టిటిడి సన్నద్ధం
– జనవరి 28న రథసప్తమి నాడు ఏడు వాహనాలపై శ్రీ మలయప్పస్వామి దర్శనం
– ఎస్ఎస్ డి టోకెన్లు, విఐపి బ్రేక్, అర్జిత సేవలు రద్దు
– జనవరి 27, 28వ తేదీల్లో వసతిగదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు
– నాలుగు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్
– గ్యాలరీల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు సరఫరా
– గ్యాలరీల్లో అవసరమైన ప్రాంతాల్లో షెల్టర్లు
– టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, 25 జనవరి : సూర్య జయంతి సందర్భంగా జనవరి 28న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నామని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తో కలిసి ఈవో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను మరింత అంకితభావంతో నిర్వహించి రథసప్తమి వేడుకలను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లను తెలియజేశారు.
– శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహిస్తారు.
– జనవరి 28న తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేయడమైనది. భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు మరియు దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది.
– జనవరి 27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ రద్దు. వసతి కేటాయింపు కోసం ఈ రెండు రోజుల్లో సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రెండు రోజులు టిబి కౌంటర్ మూసివేస్తారు.
– రోజువారీ 3.5 లక్షల లడ్డూల తయారీతో పాటు 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు.
– తిరుమలలోని గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సు- 1, 2, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, మినీ అన్నప్రసాదం కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫీ, పాలు పంపిణీ చేస్తారు.
– వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతో పాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు లక్ష మజ్జిగ ప్యాకెట్లు, రెండు లక్షల పానీయాలు, ఒక లక్ష పులిహోర ప్యాకెట్లతోపాటు 7-8 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తారు.
– ప్రస్తుతం ఉన్న 230 కుళాయిలు, 178 డ్రమ్ములు కాకుండా మాడ వీధుల్లోని గ్యాలరీలలో 408 పాయింట్ల వద్ద తాగునీటి పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
– టిటిడి శ్రీ వేంకటేశ్వర బాలమందిరం నుండి 130 మంది విద్యార్థులు సూర్యప్రభ వాహనంలో ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు.
ఈ సమీక్షలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
దర్శన స్లాట్‌లను పాటించని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా అనుమతి
శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండటానికి టిటిడి టైమ్ స్లాట్ టిక్కెట్లు, టోకెన్లను జారీ చేస్తోంది. అయితే ప్రతిరోజూ దాదాపు 3000 మంది భక్తులు స్లాట్ సమయాన్ని అనుసరించడం లేదు. నిర్దేశించిన సమయం కంటే చాలా ఆలస్యంగా వస్తున్నారు.
ఇకపై నిర్ణీత సమయానికి రాని భక్తులను టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
addComments
Post a Comment