పేదలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యం

 

నెల్లూరు, జనవరి 20 (ప్రజా అమరావతి) : పేదలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యం


గా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు. 


శుక్రవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల కేంద్రంలో ఐదోరోజు గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా   పర్యటించిన  మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.  ప్రతి గడపకు వెళ్ళిన మంత్రి ఆ కుటుంబ సభ్యులతో మమేకమవుతూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు


ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ   ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా తెలుసుకోవడం, అందకపోతే కారణాలు తెలుసుకొని అర్హులందరికీ అందించడమే ధ్యేయంగా ప్రతి గడపకు వెళుతున్నామన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని, ముత్తుకూరు మండల వాసులకు నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీని అందించామని, కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమందికి నగదు జమ కాలేదని,   సాంకేతిక కారణాలను సరిచేసి నగదు జమ చేసేందుకు  చర్యలు చేపట్టామన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ కింద జమ చేసిన నగదుకు సంబంధించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవని, ఎంతమందికి ఎంత మొత్తం చెల్లించారో ఎవరికీ తెలియడం లేదని, దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో 14 వేల రూపాయలు వంతున నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ నగదును లబ్ధిదారులకు అందించినట్లు చెబుతున్నారని, అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది లబ్ధిదారులు తమకు నగదు చేరలేదని, తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బ్యాలెన్స్ నగదు మాత్రమే అందిందని చెబుతున్నారన్నారు. గతంలో జరిగిన అవకతవకలపై పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీని 16600 కుటుంబాలకు అందించామని, బ్యాంకు ఖాతాలు సరిగా లేని 600 మందికి ఖాతాలు సరిచేసి  నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడా అవినీతి తావు లేకుండా లబ్ధిదారులకు నగదు జమ చేసినట్లు చెప్పారు.  గత ప్రభుత్వ హయాంలో చెల్లించిన నగదుకు మండల పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారని, పేదలకు సంబంధించి నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మూడేళ్ల కాలంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా  పనిచేశామని, రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తామన్నారు.  ప్రతి గడపలోనూ ప్రజలు ముఖ్యమంత్రి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఇదే తమ ప్రభుత్వ పారదర్శ పాలనకు నిదర్శనమన్నారు. 

అనంతరం మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి, ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండవరం సుగుణమ్మ, జడ్పిటిసి వెంకటసుబ్బయ్య, ఎంపీడీవో ప్రత్యూష, తాసిల్దార్ మనోహర్ బాబు,  స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments