గుడివాడ టీడీపీ సీటుకు మాజీ ఎమ్మెల్యే రావి పేరు దాదాపు ఖరారు

 *- గుడివాడ టీడీపీ సీటుకు మాజీ ఎమ్మెల్యే రావి పేరు దాదాపు ఖరారు


 *- కొడాలి నానికి ధీటైన అభ్యర్ధిగా రావికి గుర్తింపు* 

 *- కొత్త అభ్యర్ధుల చూపు ఇప్పుడు పామర్రు వైపు* 


గుడివాడ, జనవరి 10 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ సీటుకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పేరు దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కొడాలి నానికి ధీటైన అభ్యర్ధిగా రావిని అధిష్ఠానం గుర్తించినట్టుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో గుడివాడ టీడీపీ సీటును ఆశిస్తున్న కొత్త అభ్యర్ధుల చూపు ఇప్పుడు పామర్రు వైపు మళ్ళినట్టుగా తెలుస్తోంది. పామర్రులోనూ అవకాశం ఇవ్వకుంటే బందరు ఎంపీ అభ్యర్ధిత్వమైనా కేటాయించాలంటూ టీడీపీ అధిష్టానానికి అభ్యర్ధనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ సీటు గురించే ఎక్కువగా చర్చ జరుగుతూ వచ్చింది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయాపజయాలపై టీడీపీ అభ్యర్ధి ఎంపిక ప్రభావం ఉంటుందనేది రాజకీయ వర్గాల నుండి ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కూడా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ధీటైన అభ్యర్ధిని ఎంపిక చేయడంలోనే నిమగ్నమై ఉంది. గత 2019 ఎన్నికల్లో గుడివాడ టీడీపీ సీటును కొత్తగా వచ్చిన దేవినేని అవినాష్ కు కేటాయించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయం దక్కకపోగా ఎన్నికల తర్వాత అవినాష్ కూడా టీడీపీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంతకు ముందు 2014 ఎన్నికలకు ముందు కూడా గుడివాడ తెలుగుదేశం పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పటి వరకు 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. 2000వ సంవత్సరంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన రావికి పార్టీ అధిష్టానం రెండుసార్లు టీడీపీ సీటును నిరాకరించినప్పటికీ కష్టకాలంలో మాత్రం ఆ పార్టీని భుజాన మోస్తూ వస్తున్నారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే దివంగత రావి శోభనాద్రి చౌదరి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దాదాపు 17ఏళ్ళ పాటు గుడివాడలో పార్టీని టీడీపీ కంచుకోటగా మలిచారు. దేవినేని అవినాష్ టీడీపీని వీడిన తర్వాత తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావి సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ సీటు విషయంలో కొత్త అభ్యర్థుల చర్చ మొదలైంది. దీన్ని ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో టీడీపీ అధిష్టానం కూడా అలెర్ట్ అయింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే చంద్రబాబు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే రావి ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమం ద్వారా ప్రజలకు రావి మరింత దగ్గరయ్యారు. అనేక సందర్భాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే కొడాలి నానిని ధీటుగా ఎదుర్కొనడం ద్వారా రావి తన సత్తాను అధిష్టానానికి చూపగలిగారు. దీంతో పాటు గత 40 ఏళ్ళుగా రావి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణను కూడా పరిగణనలోకి తీసుకుంటూ టీడీపీ సీటుకు రావి పేరును దాదాపు ఖరారు చేస్తున్నట్టుగా టీడీపీ అధిష్ఠానం సంకేతాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రావి కూడా 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా తానే పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించుకున్నారు. టీడీపీ శ్రేణులు కూడా రావి నాయకత్వంలోనే ఉత్సాహంగా పనిచేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో గుడివాడ సీటును గెల్చుకుంటామన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి ఇక గుడివాడ నియోజవర్గంలో టిడిపి సీటు విషయంలో కొత్త అభ్యర్థుల ప్రయత్నాలకు టిడిపి అధిష్టానమే పుల్ స్టాప్ పెట్టేసినట్టుగా అర్థమవుతుంది.

Comments