8 మంది బిసి హాస్టల్ బాలికలు ఆసుపత్రికి తరలింపు
చికిత్స అనంతరం కోలుకుంటున్న విద్యార్థినులు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఫిబ్రవరి 07 (ప్రజా అమరావతి) ః
స్వల్ప అనారోగ్యానికి గురైన కొత్తవలస బిసి గర్ల్స్ హాస్టల్ బాలికలు 8 మందికి ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హాస్టల్‌లో మొత్తం 57 మంది విద్యార్థినులు ఉన్నారని, వీరిలో 8 మంది మాత్రమే, ఈ రోజు ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా ముగ్గురిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి, నలుగురిని పెందుర్తి ప్రభుత్వాసుపత్రికి, ఒకరిని కొత్తవలస ప్రభుత్వాసుపత్రికి తరలించి, వైద్య చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ 8 మంది బాలికల ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారని తెలిపారు. జిల్లా బిసి సంక్షేమాధికారి యశోధనరావు హుటాహుటిన కొత్తవలస వెళ్లి, బాలికల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మిగిలిన విద్యార్థులంతా పూర్తి ఆరోగ్యంతో, హాస్టల్‌లోనే ఉన్నారని కలెక్టర్ వివరించారు.
addComments
Post a Comment