చలివేంద్రికి... అధికారుల చొరవతో సామరస్య పరిష్కారం

*చలివేంద్రికి... అధికారుల చొరవతో సామరస్య పరిష్కారం*పార్వతీపురం, ఫిబ్రవరి 17 (ప్రజా అమరావతి): వీరఘట్టం మండలం చలివేంద్రి రైతుల సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం జరిగింది. చలివేంద్రి రైతులు శుక్ర వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు విచ్చేసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ లను కలుసుకున్నారు. చలివేంద్రిలో గురు వారం జరిగిన సంఘటనపై రైతులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కారు ఆపడం పెద్ద పొరపాటు అన్నారు. పది, పదకొండు మంది కొంత ఆవేశ పడ్డారని, ఇది మా గ్రామ సాంప్రదాయం, సంస్కృతి కాదని వారు తెలిపారు. కొంత ఆవేశంతో తెలియక పొరపాటు చేసామని మన్నించాలని కోరారు. జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చినపుడు  అనుకోని విధంగా సంఘటన జరిగిందని, పెద్ద మనసు చేసుకుని క్షమించాలని కోరారు. పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగదని వారు చెప్పారు. మంచి మనస్సు మీకు ఉందని మనస్సులో ఏమి పెట్టుకోవద్దని వారు కోరారు.  రైతులు అడిగే విధానం రైతులకు తెలియక పొరపాటు జరిగిందని, మరో ఉద్దేశ్యం లేదని రైతులు వివరించారు. 

 

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం నిల్వల పరిశీలనకు జిల్లా వ్యవసాయ అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ను శుక్ర వారం ఉదయమే పంపించి మొత్తం తీసుకురావాలని ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు ఇద్దరు అధికారులు గ్రామానికి వచ్చారనివచ్చారని, ధాన్యం సేకరణ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో మాట్లాడుటకు రైతులను ఆహ్వానించామని, అయినా ఆ విధంగా ప్రవర్తించడం బాధ అనిపించిందని అన్నారు. ప్రతి కుటుంబంలో "నేను కుటుంబ సభ్యునిగా" భావిస్తున్నానని, మీరు ఆ విధంగా పరిగణించలేదని ఆయన అన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని వచ్చామని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో పర్యటించానని, ప్రతి గ్రామంలో ఏదో ఒక సమస్య ఉందని వాటిని పరిష్కరించుటకు తమ శక్తి మేరకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ను కుటుంబ సభ్యునిగా భావించండి, ఎక్కువ సేవలు అందించుటకు సహకరించండి అని పిలుపునిచ్చారు. 


పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంకు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, జాయింట్ కలెక్టర్ ల కార్యాలయాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో సమస్య తెలియజేసి ఉంటే వెంటనే పరిష్కారం అయ్యేది అన్నారు. ఆందోళన చేయడం మన సాంప్రదాయం కాదని హితవు పలికారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, చలి వేంద్రి రైతులు ఏ. కృష్ణం నాయుడు, ఎల్.రాము, జి.ఎన్.రామకృష్ణ, బి. రమణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments