దేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తాం..


విజయవాడ (ప్రజా అమరావతి);

** దేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తాం.. 


** సర్వమత ప్రార్థనలతో విగ్రహ ప్రతిష్టాపన పనులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు.. 

** దళితుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం.. 

** రూ. 300 కోట్లతో డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రాజెక్ట్ నిర్మాణం.. 

-- రాష్ట్ర మంత్రులు 

  శ్రీ మేరుగ నాగార్జున.. 

    శ్రీ బొత్స సత్యనారాయణ.. 

    శ్రీ కొట్టు సత్యనారాయణ..  

విజయవాడలో డా. బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ మేరుగ నాగార్జున అన్నారు. 

విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణ పనులను క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులైన శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ కొట్టు సత్యనారాయణ, శ్రీ మేరుగ నాగార్జునలు గురువారం పరిశీలించారు.  

ఈసందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లతో నగర నడిబొడ్డున 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నదన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకూ అనుగుణంగా డా. బి.ఆర్. అంబేద్కర్ కు సముచిత స్థానం కల్పించాలని భావించారని, ఇందులో భాగంగా ఎవ్వరూ అడగక పోయినా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడంతో పాటు సుందరీకరణ పనులు,  లైబ్రరరీ, కన్వెన్షన్ హాల్, స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పనుల్లో ఎటువంటి లోపాలు లేకుండా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు సూచనలు అందిస్తున్నారన్నారు.   అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్ట్ కు సంబంధించి  ఇప్పటికే రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లి పరిశీలించివచ్చామన్నారు.  70 అడుగుల పేడస్టల్ నిర్మాణంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ఈరోజు విగ్రహ ఏర్పాటు పనులను సర్వమత ప్రార్థనలతో ప్రారంభించామన్నారు.  ముందుగా విగ్రహానికి సంబంధించి షూ భాగాలను ఏర్పాటు చేస్తున్నామని దశల వారీగా భాగాల వారీగా విగ్రహం ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు.  గత ప్రభుత్వం అంబేద్కర్ ను విస్మరించి అంబేద్కర్ భావజాలాన్ని తుంగలోకి త్రొక్కి ముళ్ల పొదల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి అదికూడా ఏర్పాటు చేయలేదన్నారు.  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం   సామజిక న్యాయానికి పెద్ద పీట వేసిందని దళితుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతుందన్నారు.  దీనికి అనుగుణంగా ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నదని మంత్రి నాగార్జున అన్నారు.  

రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విజయవాడ నగర నడిబొడ్డున 19 ఎకరాల్లో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు లైబ్రరరీ, కన్వెన్షన్ హాల్, పార్క్ నిర్మిస్తున్నామని అన్నారు.  ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు.  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి పలు దఫాలుగా సమీక్షించారని ఏప్రిల్ 14 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేస్తామన్నారు.  ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నదన్నారు.  80 అడుగుల పేడస్టల్ పై 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని దీనిద్వారా భూమి నుండి  విగ్రహం ఎత్తు మొత్తం  205 అడుగులు ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  విగ్రహం ఏర్పాటు పనులను సర్వమత ప్రార్థనల ద్వారా ఈరోజు ప్రారంభించామని ఆదేవుని దయతో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్ణీత సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  

రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాల్లో మన గౌరవం ఇనుమడింపచేసిన మహోన్నత వ్యక్తి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిర్మించడం ఎంతో ప్రతిష్టాత్మక విషయం అన్నారు.  కోట్లాది రూపాయల విలువైన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనలకూ అనుగుణంగా మనమందరం కలిసి పనిచేయాలన్నారు.   ఇంజినీర్లు, శిల్పులు, అధికారులు విగ్రహ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.  అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు  ఆంధ్రుల అందరికీ గర్వకారణమని ఈ విషయంలో  ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక గౌరవం దక్కుతుందన్నారు.  విగ్రహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ అన్నారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు హర్షవర్ధన్, ఏపిఐఐసి ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.హెచ్.ఎస్.ఎస్. ప్రసాద్, సిజిఎం నరసింహారావు, డి.జి.ఎం. రహీం, కెపిసి డైరెక్టర్ వాసుదేవరావు, విగ్రహ శిల్పి నరేష్, సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రఘురాం తదితరులు పాల్గొన్నారు.   


Comments