టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో కొడాలి నాని చేసిందేమీ లేదు

 *- టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో కొడాలి నాని చేసిందేమీ లేదు


 *- టీడీపీ హయాంలోనే 95శాతం నిర్మాణాలు పూర్తి* 

 *- లోకేష్ యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన* 

 *- 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లను పూర్తిచేస్తాం* 

 *- భగవంతుని ఆశీస్సులతో కోలుకుంటున్న తారకరత్న*

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 



గుడివాడ, ఫిబ్రవరి 3 (ప్రజా అమరావతి): టిడ్కో ఇళ్ళ నిర్మాణాల విషయంలో కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుడివాడ పట్టణానికి 8,912 టిడ్కో ఇళ్ళను మంజూరు చేయించామన్నారు. టీడీపీ హయాంలోనే 95శాతం ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. గత నాలుగేళ్ళుగా మిగతా 5శాతం పనులను కూడా పూర్తిచేయలేకపోయారన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు సహకారంతో గుడివాడలో పేదలకు టిడ్కో ఇళ్ళను మంజూరు చేసి చరిత్ర సృష్టించామన్నారు. సంపన్నుల గృహాలకు ధీటుగా టిడ్కో ఇళ్ళకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ఇళ్ళకు మౌలిక సదుపాయాలు. కల్పించడానికి నాలుగేళ్ళు పట్టిందన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కొడాలి నాని దుర్మార్గాలను ఎండగడుతున్నామన్నారు. కొడాలి నాని ఆస్థులన్నీ బినామీ పేర్ల మీదే ఉంటాయని, ఆధారాలు తన దగ్గర న్నాయన్నారు. డిబేట్ కు వస్తే నిరూపిస్తానని సవాల్ విసిరారు. బినామీలే బలి పశువులు కానున్నారని హెచ్చరించారు. ఇకనైనా జాగ్రత్త పడాలని సూచించారు. నందివాడ మండలం పుట్టగుంటలో గడ్డం గ్యాంగ్ మట్టిని పెద్దఎత్తున తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికలు రాస్తున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించడం లేదన్నారు. కొడాలి నాని గురించి గత 20ఏళ్ళుగా వాస్తవాలు చెబుతూనే ఉన్నానని తెలిపారు. యార్లగడ్డ వెంకట్రావు వంటి వారు ఇప్పుడు కళ్ళు తెరిచినట్టు ఉన్నారని అన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు కూడా కొడాలి నానిని నమ్ముతూ వచ్చారన్నారు. కొడాలి నానికి దోచుకోవడమే తెలుసని సాక్షాత్తూ వైసీపీ నేతలే మాట్లాడడం జరిగిందన్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడమే కొడాలి నాని చరిత్ర అని అన్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్ ను ఇష్టానుసారంగా కొడాలి నాని మాట్లాడుతున్నాడని విమర్శించారు. కొడాలి నాని గురించి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, అందరూ మాట్లాడుకునే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. పిచ్చివాగుడు మానకుంటే కొడాలి నాని బొచ్చు ప్రజలే పీకుతారన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందన్నారు. యువతను బలోపేతం చేయడం ఈ పాదయాత్ర లక్ష్యమన్నారు. ఈ పాదయాత్రకు ఆటంకం కలిగించాలన్న ఉద్ధేశ్యంతోనే జీవోనెంబరు 1ని తీసుకువచ్చారన్నారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసుకునే హక్కు తమకు ఉందన్నారు. అడ్డువచ్చిన వారిని లోకేష్ చెప్పినట్టుగా తొక్కుకుంటూ వెళ్తామన్నారు. యువగళం పాదయాత్రను 400రోజుల్లో 4వేల కిలోమీటర్ల మేర ఖచ్చితంగా పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ యావత్తు లోకేష్ కు అండగా ఉందన్నారు. ప్రభుత్వం జీవోలు తీసుకువచ్చి అడ్డంకులు సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు. యువత సంయమనం పాటిస్తోందని గుర్తుచేశారు. పిచ్చివేషాలు వేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వైసీపీ నేతలను హెచ్చరించారు. ప్రతిఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ జగన్మోహనరెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పి, మాట తప్పాడన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాలనూ ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్నారన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. భగవంతుని దయతో త్వరగా కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే రావి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, యలమంచిలి సతీష్, కంచర్ల సుధాకర్, పోలాసి ఉమామహేశ్వరరావు, అసిలేటి నిర్మల, వసంతవాడ దుర్గారావు, శొంఠి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments