ఒక్క అవకాశమిస్తే ప్రతి కుటుంబానికీ న్యాయం చేస్తా

 *- 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నా* 

 *- ఒక్క అవకాశమిస్తే ప్రతి కుటుంబానికీ న్యాయం చేస్తా


 *- అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదు* 

 *- కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనే దమ్ముంది* 

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 


గుడివాడ, ఫిబ్రవరి 8 (ప్రజా అమరావతి): 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇస్తే ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తానని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. బుధవారం గుడివాడ పట్టణం 32వ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మమత వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులు రావిని ఆశీర్వదించారు. అనంతరం రావి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, యువతను మోసం చేస్తూ వస్తున్నారన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తున్నామన్నారు. గత 20ఏళ్ళలో ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడు కాల్వగట్టుపై నివాసముంటున్న పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపాలని అడిగినందుకు తనపై కేసులు పెట్టారన్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని, కోర్టులో హాజరుపర్చగా ధర్మమే గెలిచిందన్నారు. ఆక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనే దమ్ముందని చెప్పుకొచ్చారు. టీడీపీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ప్రజల స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పేదలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు దొంగ మాటలు చెప్పి లక్షల కోట్లు అప్పు చేసి దోచుకుంటున్నారన్నారు. ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. తాను ఇసుక అమ్ముకోనని, మట్టిని దోపిడీ చేయనని చెప్పారు. కేసినో వంటి అసాంఘిక వ్యవహారాల జోలికి వెళ్ళనని మాటిస్తున్నానన్నారు. కొడాలి నాని విషయంలో ప్రజలే సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. గుడివాడ నుండి తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గత 20ఏళ్ళుగా ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గ ప్రజలను తన స్వార్ధానికి వినియోగించుకున్నాడన్నారు. అధికారం వచ్చిన తర్వాత రూ.వేల కోట్లు దోచుకున్నాడన్నారు. ప్రజలతో పని లేదన్న పద్దతిలోనే కొడాలి నాని ముందుకు వెళ్తున్నాడన్నారు. ముఖ్యంగా పేదల పక్షాన ఆలోచన చేయడం లేదని, నాగవరప్పాడు కాల్వగట్టుపై ఇళ్ళను కూల్చివేయించాడన్నారు. దీన్ని గుడివాడ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కొడాలి నాని చేసిన దుర్మార్గాలు, భూకబ్జాలను అరికడతానని మాటిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అర్హులందరికీ పథకాలను అందజేశామన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీలను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రావి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ప్రముఖులు సత్యప్రసాద్, గొర్ల పాండురంగారావు, సూరపనేని బాబి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, పోలాసి ఉమామహేశ్వరరావు, పండ్రాజు సాంబశివరావు, చల్లగుళ్ళ వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, మధుసూదనరావు, శొంఠి రామకృష్ణ, బుజ్జి, రెడ్డి అప్పారావు, నీరుడు సురేష్, కోలవెన్ను గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments