*సకల సౌకర్యాలతో... పునరావాస కాలనీలు
*
సుమారు రూ.30 కోట్ల వ్యయంతో గూడెపువలస, లింగాలవలస కాలనీల్లో వసతులు
ప్యాకేజీలో భాగంగా ఒక్కో కుటుంబానికి 5 సెంట్లు స్థలం, రూ.9.20 లక్షల సాయం
ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, విశాలమైన రోడ్లు, బిజినెస్ కాంప్లెక్సులు
తాగునీటి సదుపాయం కోసం ట్యాంకుల నిర్మాణం.. ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు
పూర్తిస్థాయిలో పరిహారం అందజేత.. ప్రశాంత వాతావరణంలో నిర్వాసితుల తరలింపు
సదుపాయాల కల్పనపై, అధికారుల సహకారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నిర్వాసితులు
విజయనగరం, ఫిబ్రవరి 14 (ప్రజా అమరావతి) ః భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో ఆర్ & ఆర్ ప్యాకేజీ చెల్లించటంతో పాటు ఆధునిక వసతులతో కూడిన కొత్త ఊళ్లు నిర్మించింది. సుమారు రూ.30 కోట్లు కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే కేటాయించి ప్రత్యేక చర్యలు తీసుకుంది. జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ప్రత్యేక చొరవతో విజయనగరం ఆర్డీవో, భోగాపురం మండల స్థాయి అధికారులు నిర్వాసితులకు నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని అవసరాలను తీరుస్తున్నారు. ఆర్ & ఆర్ ప్యాకేజీలో పేర్కొన్న నిబంధనల మేరకు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించటంతో పాటు, అన్ని రకాల వసతులతో కూడిన కాలనీలు నిర్మించటంలో జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నిర్వాసితులను పలకరించిగా కాలనీల్లో జరిగిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
*గూడెపువలస, లింగాలవలసల్లో కొత్త ఊళ్లు*
విమానాశ్రయం కోసం భూములు త్యాగాలు చేసిన బొల్లింకలపాలెం, రెల్లిపేట, మరడపాలెం, ముడసర్లపేట గ్రామస్థుల సౌకర్యార్థం అధికారులు కొత్తగా రెండు కొత్త ఊళ్లను నిర్మించారు. ఆధునిక సదుపాయాలతో కూడిన అన్ని రకాల వసతులను సమకూర్చారు. నిర్వాసితుల పూర్తిస్థాయి అంగీకారం మేరకు వారికి నచ్చిన విధంగా కాలనీలు నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. మరడపాలెం గ్రామానికి చెందిన 223 కుటుంబాలకు, ముడసర్లపేట గ్రామానికి చెందిన 33 కుటుంబాలకు పోలిపల్లి రెవెన్యూ పరిధిలోని లింగాలవలసలో 25 ఎకరాల్లో ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసి ఆవాసం కల్పించారు. రెల్లిపేటకు చెందిన 65 కుటుంబాలకు, బొల్లింకలపాలెంకు చెందిన 55 కుటుంబాలకు గూడెపువలసలో 17 ఎకరాల పరిధిలో కాలనీ నిర్మించి పునరావాసం కల్పించారు. ఇటీవల కాలనీలకు తరలివచ్చిన నిర్వాసితుల సౌకర్యార్థం తాత్కాలికంగా ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీ సేవలు అందుబాటులోకి వచ్చే వరకు వైద్య సేవలందించే నిమిత్తం రెండు కాలనీల్లో కూడా వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు.
*మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట*
గూడెపువలస, లింగాలవలస కాలనీల్లో రూ.30 కోట్లు వెచ్చించి విశాలమైన సీసీ రోడ్లు, మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ అందమైన అప్రోచ్ రోడ్లు, పిల్లల సౌకర్యార్థం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు నిర్మించారు. ప్రజల ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందమైన పార్కులు, కమ్యూనిటీ భవనాలు, కల్యాణ మండపాలు, గ్రామ దేవతల ఆలయాలను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. తాగునీటి సదుపాయం నిమిత్తం ఓవర్ హెడ్ ట్యాంకులు, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇతర అవసరాల నిమిత్తం పోస్టాఫీసు, బిజినెస్ కాంప్లెక్సులు, పశు వైద్య శాలలు ఏర్పాటు చేశారు. కాలం చెల్లిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎత్తైన రక్షణ గోడ కలిగిన శ్మశాన వాటికలను కూడా ఏర్పాటు చేయటం గమనార్హం. చెత్త తరలింపు కేంద్రాలు, నిత్యం విద్యుత్ సరఫరా ఉండే విధంగా హైపవర్ కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లు, వివిధ ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేశారు.
*పూర్తిస్థాయిలో పరిహారం అందజేత*
ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించామని విజయనగరం ఆర్డీవో సూర్యకళ తెలిపారు. రెండు చోట్లా 376 కుటుంబాలకు ఆవాసం కల్పించామని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి అయిదు సెంట్ల స్థలం, రూ.9.20 లక్షల ఆర్థిక సహాయం అందించామన్నారు. అలాగే భూములు, ఇళ్లు, గుడిసెలు, పాకలు కోల్పోయిన వారికి ఆర్ & ఆర్ ప్యాకేజీ ప్రకారం అదనపు పరిహారం అందజేశామని వివరించారు. 376 కుటుంబాలకు చెందిన ఇళ్ల నిర్మాణాల కోసం రూ.34.59 కోట్లు చెల్లించినట్లు ఆర్డీవో పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాలకు ఒక్కొ ఇంటి నిర్మాణానికి 30 టన్నుల వరకు ఉచితంగా ఇసుక సరఫరా చేశామని వివరించారు. ఉమ్మడి కుటుంబాలకు చెందిన నిర్వాసితులు కూడా అయిదేసి సెంట్ల స్థలం కేటాయించామని అయితే వారిలో ఒక్కరు నిర్మించిన ఇంటిలో అందరూ ఉంటున్నారని.. అందువల్ల అక్కడక్కడ ఖాళీ సైట్లు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు.
*మిగిలిన వారికీ పరిహారం ఇస్తాం...*
ప్రస్తుతం ప్యాకేజీలో కవర్ కాని వారికి కూడా నష్టపరిహారం అందజేస్తామని ఆర్డీవో సూర్యకళ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సుమారు మరో 25 కుటుంబాల వరకు నిర్వాసితులు ఉన్నారని వారికి ఆర్థిక సాయం అందజేస్తామని వివరించారు. అలాగే గతంలో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన వారిలో 19 మంది అనుకోకుండా మృత్యువాత పడ్డారని.. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు సంబంధిత పరిహారం అందిస్తామని ఆర్డీవో స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ అందించే విషయంలో కోర్టు ఇచ్చే ఉత్వర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే వలస కార్మికుల సౌకర్యార్థం ప్రత్యేక స్థలం కేటాయించి జగనన్న కాలనీ మాదిరి ప్రత్యేక కాలనీ నిర్మిస్తామని చెప్పారు.
*నిర్వాసితుల ఉపాధికి కలెక్టర్ ప్రత్యేక చొరవ*
నిర్వాసిత కాలనీలకు చేరుకున్న ప్రజలకు తక్షణ ఉపాధి కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డ్వామా పీడీని కాలనీలకు పంపించి ఉపాధి అవసరమైన వారిని గుర్తించి నివేదిక తయారు చేయమని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం నుంచే కొంతమందికి ఉపాధి హామీ పథకంలో భాగంగా స్థానికంగా పని కల్పించారు. కాలనీలకు సమీప ప్రాంతంలో వారికి జాబ్ కార్డులను అనుసంధానం చేసి స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
*బలవంతం లేదు.. వారి అంగీకారంతోనే తరలించాం*
విమానాశ్రయం కోసం భూములు త్యాగం చేసిన వారిని బలవంతంగా తరలించలేదు. ప్రతి చర్యా.. వారి అనుమతి, అంగీకారంతోనే చేశాం. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి కాలనీలకు తరలించాం. తగిన గడువు ఇచ్చిన తర్వాతనే తరలింపు ప్రక్రియను చేపట్టాం. 2021లోనే పరిహారం చెల్లించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వాసితుల విజ్ఞప్తి మేరకు పలుమార్లు గడువు పెంచుతూ వచ్చాం. సంక్రాంతి తర్వాత కొత్త కాలనీలకు వెళ్లిపోతామని నిర్వాసితులే చెప్పారు. అయినా మరొక నెల గడువు ఇచ్చాం. కాలనీల్లో ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని రకాల పనులను పూర్తి చేశాం. పరిస్థితులు అనుకూలించక అక్కడక్కడ నిర్వాసితులు ఇళ్లను సకాలంలో నిర్మించుకోలేకపోయారు. త్వరలోనే అన్నీ పూర్తవుతాయి. మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా ఇబ్బందులు లేవు.
ఆర్డీవో సూర్యకళ, విజయనగరం.
....................................................
నిర్వాసితుల అభిప్రాయాలు
....................................................
1) *కాలనీలో సదుపాయాలు బాగున్నాయి...*
ఇక్కడికి నాలుగు రోజుల క్రితం వచ్చాం. కాలనీ చాలా పెద్దగా ఉంది. పెద్దపెద్ద రోడ్లు, వర్షపు నీరు, వాడుక నీరు పోవడానికి డ్రెయినేజీలు బాగా కట్టారు. పిల్లల చదువు కోసం పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు నిర్మించారు. అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం ఆలయాలను, ప్రార్థనా మందిరాలు నిర్మిస్తున్నారు. పిల్లలు ఆడుకోడానికి పార్కు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరికీ ఐదేసి సెంట్లు స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకోడానికి రూ.9.20 లక్షల చొప్పున డబ్బులు కూడా అందజేశారు. మమ్మల్ని ప్రత్యేక వాహనాల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారు.
యర్రంశెట్టి అప్పలరాజు, (8వ వార్డు మెంబర్) గూడెపువలస
2) *అధికారులు బాగా సహకరించారు...*
ముందు చెప్పిన ప్రకారం అందరికీ భూమి ఇచ్చారు. ఇల్లు కట్టుకోడానికి డబ్బులు కూడా ఇచ్చారు. మమ్మల్ని ఇక్కడికి తీసుకురావటంలో అధికారులు, సిబ్బంది బాగా సహకరించారు. మాకు ఇక్కడ బాగానే ఉంది. పిల్లలకు బడి, అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి.
ః నిమ్మకాయల భవానీ, గూడెపువలస
3) *ఇంటింటికీ కుళాయిలు పెట్టారు...*
మేము అందరి కన్నా నెల రోజుల ముందుగానే వచ్చాం. మేము వచ్చేటప్పటికే ఇక్కడ కరెంటు వేశారు. ఇంటింటికీ కుళాయిలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి. మాకు అన్ని డబ్బులూ వచ్చేశాయి. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. కొంతమంది ఇంకా ఇళ్లు కట్టుకుంటున్నారు. అందరి ఇళ్లూ అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది.
బొల్లింకల నరసయమ్మ, గూడెపువలస
addComments
Post a Comment