రానున్న వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

 


- సచివాలయంలో ఇంధనశాఖపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

- మార్చి నాటికి 1.25 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు

- రాష్ట్ర వ్యాప్తంగా 100 కొత్త సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవం

- ప్రైవేటు కంపెనీల బకాయిల వసూళ్ళపై దృష్టి

- తక్షణం బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశం

- 2617 జగనన్న లేఅవుట్లలో విద్యుద్దీకరణ పూర్తి

- రానున్న వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి


- కృష్ణపట్నం, ఎన్టిటిపిఎస్ లో కొత్త యూనిట్లను వినియోగంలోకి తేవాలి

- బొగ్గు కొరత లేకుండా ముందుస్తుగానే నిల్వలను సరిచూసుకోవాలి


: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


అమరావతి (ప్రజా అమరావతి):


1) ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.25 లక్షల వ్యవసాయ కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లను రైతులకు అందిచనున్నట్లు  రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో సోమవారం ఇంధనశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...


2) రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను రైతన్నలకు అందించాలని సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు పనిచేయాలి. అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుకి ఉచిత విద్యుత్ కనెక్షన్ ను మంజూరు చేయాలి. వచ్చే నెలాఖరు నాటికి మొత్తం లక్షా పాతికవేల కనెక్షన్ లను పూర్తి చేయాలి. అలాగే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సబ్ స్టేషన్ లలో 100 సబ్ స్టేషన్లను కూడా అదే గడువు నాటికి పూర్తి చేయాలి.  


3) రానున్న వేసవిలో డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ ఉత్పాదనకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. కృష్ణపట్నం, ఎన్టిటిపిఎస్ లోని కొత్త యూనిట్లను కూడా వినియోగంలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం రోజుకు 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్ళకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.  ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను పెంచుకోవాలి. అలాగే వేసవిలో డిమాండ్ కు తగినట్లు అవసరమైతే బయటి నుంచి విద్యుత్ కొనుగోళ్ళు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. 


4) రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కర్మాగారాలు, వ్యాపార సంస్థల నుంచి హెచ్ టి కనెక్షన్ ల నుంచి దాదాపు రూ.349 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. దీనిపై డిస్కంలు దృష్టి సారించాలి. రానున్న రెండు నెలల్లో ఈ బకాయిలను నూరుశాతం వసూలు చేయాలి. నిర్థిష్ట కాల పరిమితితో ఈ బకాయిలను వసూలు చేయాలి. రెగ్యులర్ విద్యుత్ బిల్లులతో బకాయిలకు గానూ డిమాండ్ నోటీస్ లను జారీ చేయాలి. 


5) రాష్ట్ర వ్యాప్తంగా 9979 జగనన్న కాలనీ లేఅవుట్లు ఉన్నాయి. వీటిల్లో 2617 లేఅవుట్లలో అంటే దాదాపు26.25 శాతం విద్యుతీకరణ పూర్తయ్యింది. మొత్తం రూ.1850 కోట్ల కు గానూ ఇప్పటి వరకు రూ. 257.41 కోట్లు అంటే 25.67 శాతం ఖర్చు చేశాం. అలాగే లేఅవుట్లలోని 21,851 గృహాలు, సొంతభూముల్లో నిర్మించుకున్న 1,43,823 గృహాలకు కలిపి మొత్తం 1.65 లక్షల జగనన్న పక్కా గృహాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాం. సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ఇంధన శాఖను బలోపేతం చేసేందుకు, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. సీఎం గారి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి.


6) ఈ సమీక్షలో పాల్గొన్న ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్, ట్రాన్స్ కో సిఎండి బి.శ్రీధర్, జెఎండి ఐ.పృథ్వితేజ్, విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, ట్రాన్స్ కో సిఎండిలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments