శ్రీశైల మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్




అమరావతి (ప్రజా అమరావతి);


*శ్రీశైల మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*శాస్త్రోక్తంగా ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణ*


*త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన*


*హాజరైన నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి*


 రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీశైలం మల్లన్న స్వామి వారికి ఆర్థిక శాఖ  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పట్టువస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి , అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హారతులిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ మంత్రి బుగ్గన ఆలయ ప్రదక్షిణలు చేశారు. అనంతరం  శాస్త్రోక్తంగా  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ..స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. తరవాత అమ్మవార్లకు గ్రామోత్సవం వైభవంగా జరిపారు. అంతకు ముందు ఆలయ రాజ గోపురం వద్ద ఈవో లవన్న, ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి మంత్రి బుగ్గనకు స్వాగతం పలికారు. 


*శాస్త్రోక్తంగా ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణ*


రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రోక్తంగా  ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణకు శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్ని బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఇళ్ళకు ప్లానింగ్ ఉన్నట్లే ఆలయాలను  కూడా నిర్దిష్ట ప్రణాళికతో తీర్చిదిద్దుతామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని ఏపీలో అన్ని వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఆలయాలను నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వస్త్రాలు సమర్పించడం మహద్భాగ్యమన్నారు.రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. శ్రీశైల క్షేత్రంలో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణానికి తోడ్పాటునందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించనున్నామని ముఖ్యమంత్రి మాటలను మంత్రి బుగ్గన పునరుద్ఘాటించారు.


కార్యక్రమంలో మంత్రితో పాటు వెంట నంద్యాల   పార్లమెంట్ సభ్యులు  పోచా బ్రహ్మానందారెడ్డి , ఈవో లవన్న, ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి కూడా హాజరయ్యారు.


Comments