పిన్నమనేని"తో టీడీపీ కంచుకోటగా మారనున్న కైకలూరు

 *- "పిన్నమనేని"తో టీడీపీ కంచుకోటగా మారనున్న కైకలూరు* 


 *- జయమంగళ వెళ్ళినా అంతకు మించి బలోపేతం* 

 *- పిన్నమనేని కుటుంబానిది దశాబ్దాల రాజకీయ చరిత్ర* 

 *- రాజకీయంగా గ్రామగ్రామాన చెక్కు చెదరని వర్గం* 

 *- ఓటమి నుండి 2024లో విజయం తథ్యమన్న సంకేతాలు* 

 *- కైకలూరు సహా ఏలూరు, కృష్ణాలోనూ ప్రభావం* 



 కైకలూరు /ఏలూరు జిల్లా, ఫిబ్రవరి 21 (ప్రజా అమరావతి): వచ్చే 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జిలు ఆసక్తి చూపడంతో ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరడంతో కైకలూరు టీడీపీలో ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పిన్నమనేని కుటుంబం ముందుకు వచ్చి టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. చంద్రబాబు ఆదేశిస్తే తమ కుటుంబం నుండి కైకలూరు అసెంబ్లీకి టీడీపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మండవల్లి, ముదినేపల్లి మండలాలతో ఉన్న స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జి కూడా తనకు సీటిస్తే కైకలూరు నుండి పోటీ చేయడానికి సిద్ధమని, బాబాయ్ పిన్నమనేని వెంకటేశ్వరరావుకు ఇచ్చినా కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. కైకలూరు టీడీపీలో అనిశ్చితి నెలకొన్న వేళ పిన్నమనేని కుటుంబం పోటీకి సిద్ధమని చేసిన ప్రకటన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని మాత్రం నింపిందని అంటున్నారు. దీంతో జయమంగళ టీడీపీని వీడినా పిన్నమనేనితో అంతకు మించి పార్టీ బలోపేతమవుతుందని సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా పిన్నమనేని కుటుంబానికి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. ఈ కుటుంబం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దాదాపు 30 ఏళ్ళ పాటు కృష్ణాజిల్లా పరిషత్ రాజకీయాలను శాసించారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఇదే కుటుంబం నుండి ఇద్దరు ఆప్కాబ్ చైర్మన్లుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవినీ చేపట్టారు, ఒక విధంగా చెప్పాలంటే జడ్పీ రాజకీయాలను శాసించిన దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు దగ్గర నుండి మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జి వరకు దశాబ్దాల పాటు పదవులన్నీ పిన్నమనేని కుటుంబం చుట్టూనే తిరుగుతూ వచ్చాయి. అన్నివర్గాల ప్రజలకు అంతకంతకు సేవ చేస్తూ వచ్చారు. ఈ కారణంగానే పిన్నమనేని కుటుంబానికి గ్రామగ్రామాన బలమైన, చెక్కు చెదరని వర్గం తయారైంది. గత 14 ఏళ్ళుగా నామినేటెడ్ పదవులకే పరిమితమైనా పిన్నమనేని వెంటే వర్గమంతా కలిసి ఉండడం విశేషం. అందువల్లే రాజకీయాల్లో ఏ స్థాయి పదవులైనా పిన్నమనేని కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చాయి, ఇప్పుడు కూడా అదే పిన్నమనేని కుటుంబం కైకలూరు నుండి టీడీపీ తరపున పోటీకి సిద్ధంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆదేశిస్తేనే అంటూ హుందాతనంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. కైకలూరు టీడీపీ సీటును కేటాయిస్తే గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని పిన్నమనేని కుటుంబం ప్రకటించింది. దీన్నిబట్టి 2019 ఎన్నికల్లో కైకలూరు అసెంబ్లీలో ఎదురైన ఓటమి నుండి 2024 ఎన్నికల్లో టీడీపీకి విజయం తథ్యమన్న సంకేతాలు వచ్చినట్టైంది. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం కైకలూరు అసెంబ్లీ సహా ఏలూరు, కృష్ణాజిల్లాలపై పిన్నమనేని ప్రభావం స్పష్టంగా కన్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కైకలూరు టీడీపీ సీటు విషయంలో పిన్నమనేని రూపంలో అందివచ్చిన అవకాశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వినియోగించుకుంటే మాత్రం రెండు జిల్లాల్లో చాలా చోట్ల వైసీపీకి సీన్ రివర్స్ అవుతుందని కూడా అంచనాలు ఉన్నాయి. ఒకవైపు కైకలూరులో టీడీపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న వేళ పిన్నమనేని వర్గం రోజురోజుకూ బలోపేతమవుతూ వస్తోంది. ఇంకోవైపు చంద్రబాబు నిర్ణయం కోసం పిన్నమనేని కుటుంబం, వర్గంతో పాటు కైకలూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

Comments