అదానీ ఎఫెక్ట్‌.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు


  అదానీ ఎఫెక్ట్‌.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు


దిల్లీ (ప్రజా అమరావతి): భారీగా కుప్పకూలుతున్న అదానీ గ్రూప్‌ షేర్ల ఎఫెక్ట్‌ రెండోరోజు పార్లమెంట్‌(Parliament)పై పడింది. దాంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి.అదానీ గ్రూప్‌ (Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది కాస్తా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. దాంతో సోమవారం వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.


ఈ బడ్జెట్‌ సమావేశాల్లో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలన్నాయి. వారి అభ్యర్థనలను లోక్‌సభ(Lok Sabha) స్పీకర్ నిరాకరించారు.సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరోవైపు రాజ్యసభ(Rajya Sabha) ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దాంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. తర్వాత మళ్లీ కార్యాకలాపాలు ప్రారంభమైనప్పటికీ.. విపక్షాల నుంచి అదే డిమాండ్ వినిపించింది. దాంతో ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ సోమవారానికి వాయిదా పడింది.

Comments