ఫ్యామిలీ డాక్ట‌ర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం


ప్రాంతంః ఏపీ ఐఐసీ ట‌వ‌ర్స్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాల‌యం, మంగ‌ళ‌గిరి (ప్రజా అమరావతి);



*ఫ్యామిలీ డాక్ట‌ర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం


*

*జ‌గ‌న‌న్న ఆలోచ‌న‌ల్లోంచి పుట్టిన వైద్య విధానం ఇది*

*ఫ్యామిలీ డాక్ట‌ర్ ప్రారంభోత్స‌వానికి సిద్ధంగా ఉండాలి*

*ఆస్ప‌త్రుల నిర్మాణాల‌న్నీ పూర్త‌వ్వాలి*

*సిబ్బంది లేని చోట్ల వెంట‌నే భ‌ర్తీ చేయండి*

*మార్చి నాటికి ఎక్క‌డా ఖాళీలు ఉండ‌టానికి వీల్లేదు*

*104 వాహ‌నాల‌ను సిద్ధంగా ఉంచండి*

*వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఐదు నూత‌న మెడిక‌ల్ క‌ళాశాల‌లు*

*ఎన్ ఎంసీ అనుమ‌తులు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోండి*

*సికిల్‌సెల్ అనీమియా విష‌యంలో ప్ర‌త్యేక దృష్టి*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*


త‌మ ప్ర‌భుత్వానికి ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ద‌ని, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆలోచ‌న‌ల్లోంచి పుట్టిన ఈ వైద్య విధానాన్ని ప్ర‌జ‌ల‌కు విజ‌య‌వంతంగా అంద‌జేయాల్సిన అవ‌స‌రం అధికారులంద‌రిపై ఉంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం, ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లోని కాన్ఫ‌రెన్స్ హాలులో గురువారం మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం, స‌న్న‌ద్ధ‌త‌పై పూర్తి స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ ఈ మార్చి నుంచే ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ల‌క్ష్యాన్ని నిర్దేశించార‌ని, ఆ మేరకు అన్ని సిద్ధం చేసుకోవాల్సిన బాధ్య‌త మనంద‌రిపై ఉంద‌ని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ఈ వైద్య విధానాన్ని అందించ‌బోతున్న నేప‌థ్యంలో... ఆయా ఆస్ప‌త్రుల నిర్మాణాల‌న్నీ త్వ‌ర‌గా పూర్త‌య్యేలా చూడాల‌ని ఆదేశించారు. విలేజ్ క్లినిక్‌ల‌కు 104 వాహ‌న‌ల ద్వారా వైద్య సిబ్బంది, ప‌రిక‌రాలు, మందులు వ‌స్తాయ‌ని, వీటి ద్వారా ప్ర‌జ‌ల‌కు వైద్యం అందుతుంద‌ని తెలిపారు. ఈ వైద్య విధానం కోసం అవ‌స‌ర‌మై న అన్ని 104 వాహ‌నాల కొనుగోళ్లు పూర్త‌య్యాయ‌ని చెప్పారు.

*ఎక్క‌డా స‌మ‌స్య‌లు ఉండ‌టానికి వీల్లేదు*

విలేజ్ హెల్త్ క్లినిక్‌ల‌లో ఇంకా ఎక్కడైనా సిబ్బంది ఖాళీలు ఉంటే.. వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని అధికారుల‌కు మంత్రి విడ‌ద‌ల ర‌జిని సూచించారు. ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం అధికారికంగా ప్రారంభ‌మ‌య్యేనాటికి ఏ విలేజ్ హెల్త్ క్లినిక్‌లోనూ మందులు, సిబ్బంది, రియేజంట్లు, పరిక‌రాల కొర‌త అనే మాటే రావ‌డానికి వీల్లేద‌ని, ఆయా స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే ఇప్పుడే ప‌రిష్క‌రించుకోవాల‌ని పేర్కొన్నారు. అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, అంగ‌న్‌వాడీ సెంట‌ర్ల‌లోని పిల్ల‌లంద‌రికీ ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానంలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంద‌ని చెప్పారు. ఆయా ప‌రీక్ష‌ల్లో ఎవ‌రికైనా ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు తేలితే వారికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు.  విద్యార్థుల‌కు అదే డాక్ట‌ర్ వైద్యం ఇవ్వడ‌మా, పై ఆస్ప‌త్రుల‌కు పంపండ‌మా.. అనే విష‌యాల‌పై స్ప‌ష్ట‌త ఉండాల‌ని, విద్యార్థులంద‌రి ఆరోగ్యం బాగుండాల‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో త‌గిన కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్లాల‌ని చెప్పారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 17 ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌లు నిర్మిస్తున్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందేన‌న్నారు. వీటిలో ఐదు మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. విజ‌య‌నగ‌రం, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్ట‌ణం, నంద్యాలలో ఎన్ ఎంసీ త‌నిఖీల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. 

*గిరిజ‌న ప్రాంతాల‌పై దృష్టి పెట్టండి*

ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం గిరిజ‌న ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రుస్తుంద‌నే ఆకాంక్ష ప్ర‌భుత్వానికి ఉన్న‌ద‌ని మంత్రి తెలిపారు. సికెల్ సెల్ అనీమియాతో బాధ‌ప‌డే వారంద‌రినీ గుర్తించి వారి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చాల్సిన బాధ్య‌త‌ను ఈ వైద్య‌విధానం ద్వారా ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ద‌నే విష‌యాన్ని గుర్తించాల‌న్నారు. ఈ వ్యాధి నివార‌ణ‌పై త‌గిన కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. ప‌రీక్ష‌లు చేసేందుకు కావాల్సిన కిట్ల‌ను వెనువెంట‌నే తెప్పించాల‌న్నారు.  సికెల్ సెల్ అనీమియాకు చికిత్స‌పై స‌మ‌ర్థ‌వంత‌మైన‌ కార్యాచ‌ర‌ణ త‌యారుచేయాల‌ని, ప‌రీక్ష‌లు చేసేందుకు కిట్లు త్వ‌రిత గ‌తిన తెప్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న  పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్ప‌త్రులు.. వాటి పురోగ‌తిపై ఆరాతీశారు. యూపీహెచ్‌సీల్లో వ‌స‌తులు, సిబ్బందిని గ‌ణ‌నీయంగా పెంచిన నేప‌థ్యంలో వాటిల్లో వైద్య సేవ‌లు వినియోగించుకునే విష‌య‌మై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌ని చెప్పారు. అవ‌స‌రమైతే యూపీహెచ్‌సీ సిబ్బందితో వారి వారి ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటుచేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ఆయా ఆస్ప‌త్రుల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు వాలంటీర్ల సాయం కూడా తీసుకోవాల‌న్నారు. కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని త్వ‌ర‌లో ప్రారంభించాల‌ని, మిగిలిన అవ్వాతాత‌ల‌కు కూడా ప‌రీక్ష‌లు చేయాల‌ని చెప్పారు. కార్య‌క‌ర్ర‌మంలో వైద్య ఆరోగ్య‌శాఖ‌ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ బాబు, కుటంబు సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ నివాస్‌, ఏపీ ఎంఎస్ఐడీసీ ఎండీ ముర‌ళీధ‌ర్‌రెడ్డి, ఆరోగ్య‌శ్రీ సీఈవో హ‌రీంద్ర‌ప్ర‌సాద్ తదిత‌రులు పాల్గొన్నారు.

Comments