పిన్నమనేని చూపు కైకలూరు అసెంబ్లీ వైపు.

 *- పిన్నమనేని చూపు కైకలూరు అసెంబ్లీ వైపు* 


 *- ఉమ్మడి రాష్ట్రంలో విద్యా మంత్రిగా పీవీఆర్* 

 *- పునర్విభజనలో రద్దయిన ముదినేపల్లి అసెంబ్లీ* 

 *- కైకలూరు అసెంబ్లీలోనే ముదినేపల్లి మండలం* 

 *- 5సార్లు ఎమ్మెల్యేలుగా పిన్నమనేని కుటుంబం* 

 *- పిన్నమనేని నెట్ వర్క్ అంతా సేమ్ టూ సేమ్* 


గుడివాడ, ఫిబ్రవరి 14 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా రాజకీయాలను శాసించిన పిన్నమనేని కుటుంబం చూపు ఇప్పుడు ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ వైపు పడింది. 2022 ఏప్రిల్ 4వ తేదీ వరకు కృష్ణాజిల్లాలో కొనసాగిన కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఆ తర్వాత జరిగిన జిల్లాల విభజనతో ఏలూరు జిల్లాలోకి వెళ్ళిపోయింది. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాలతో కలిసి ఉంది. ఈ నియోజకవర్గంలో దాదాపు 2లక్షల మంది ఓటర్లు ఉన్నారు.  నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉన్న ముదినేపల్లి నియోజకవర్గం నుండి 1978, 1983 సంవత్సరాల్లో జడ్పీ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుండి 1989, 1999, 2004 సంవత్సరాల్లో దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పిన్నమనేని వెంకటేశ్వరరావు పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో ముదినేపల్లి అసెంబ్లీ రద్దయింది. దీంతో పిన్నమనేని వెంకటేశ్వరరావు దృష్టి గుడివాడ అసెంబ్లీ వైపు పడింది. దీనికి కారణం తన సొంత మండలం నందివాడను గుడివాడ నియోజకవర్గంలో కలపడమేనన్న ప్రచారం కూడా ఉంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గుడివాడ అసెంబ్లీ నుండి పిన్నమనేని వెంకటేశ్వరరావు పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పిన్నమనేని కుటుంబం టీడీపీలో చేరిపోయింది. ఆప్కాబ్ చైర్మన్ గా కూడా పిన్నమనేని వెంకటేశ్వరరావు పనిచేశారు. ఇక కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే 1952 నుండి 2019 వరకు 16సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కైకలూరు అసెంబ్లీ పరిధిలో కైకలూరు, కలిదిండి, మండవల్లి మండలాలు మాత్రమే ఉండేవి. పునర్విభజన తర్వాత రద్దయిన ముదినేపల్లి నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం కైకలూరు అసెంబ్లీలో కలిసిపోయింది. ఇక్కడ 9సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, రెండుసార్లు టీడీపీ అభ్యర్థులు, మూడుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఒకసారి బీజేపీ అభ్యర్ధి విజయం సాధించారు. 2014లో టీడీపీ పొత్తుతో బీజేపీ అభ్యర్థిగా గెల్చిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా పిన్నమనేని కుటుంబానికి కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మంచి పట్టు ఉంది. దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు, ఆయన కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావులు ముదినేపల్లి ఎమ్మెల్యేలుగా 5సార్లు గెలుపొందుతూ వచ్చారు. ముదినేపల్లి మండలం కూడా ప్రస్తుతం కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలవడంతో ఇక్కడి నుండి పోటీ చేయాలని పిన్నమనేని కుటుంబంపై వత్తిడి పెరుగుతోంది. జడ్పీ చైర్మన్ గా 30 ఏళ్ళు జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన దివంగత కోటేశ్వరరావుకు మండవల్లి లంక గ్రామాల్లో విశేష ఆదరణ ఉంది. కొల్లేరు ప్రాంత ప్రజల్లోనూ పిన్నమనేని కుటుంబానికి మంచి పట్టు ఉంది. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రోడ్లు, పాఠశాలలు వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పన అంతా దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు హయాంలోనే జరగడం విశేషం. ఇన్ని కలిసొచ్చే అంశాల నేపథ్యంలో పిన్నమనేని కుటుంబానికి ప్రతి గ్రామంలోనూ బలమైన వర్గం అండగా నిలుస్తోంది. గత ముదినేపల్లి అసెంబ్లీ నుండి కైకలూరు అసెంబ్లీకి మారినప్పటికీ పిన్నమనేని నెట్ వర్క్ అంతా సేమ్ టూ సేమ్ అంటూ సీనియర్ రాజకీయ నేతలు సైతం విశ్లేషిస్తున్నారు. కాగా పిన్నమనేని కుటుంబం నుండి టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జి ఈసారి ఎమ్మెల్యే సీటును ఆశించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గుడివాడ అసెంబ్లీకి టీడీపీ సీటు రేసులో కూడా ఉన్న పిన్నమనేని బాబ్జి గత ఏడాది కిందటే కైకలూరు టీడీపీ సీటును కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వ్యవహారంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో కైకలూరు అసెంబ్లీకి బలమైన టీడీపీ అభ్యర్ధి అయ్యే అవకాశాలున్న పిన్నమనేని బాబ్జి లేదా మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పేరును పార్టీ అధిష్ఠానం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

Comments