న్యూఢిల్లీ (ప్రజా అమరావతి): బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లోనూ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో అసీస్‌ను మట్టి కరిపించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. గెలుపు కోసం కేవలం 113 పరుగులు కావాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 26.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ వేగంగా ఆడి 20 బంతుల్లోనే 31 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నాథన్ లయన్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత చటేశ్వర్ పుజారా నిదానంగా ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్తపడ్డాడు. మొత్తం 74 బంతులు ఎదుర్కొన్న పుజారా 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (20), శ్రేయాస్ అయ్యర్ (12) పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో శ్రీకర్ భరత్ వన్డేలా ఆడి 22 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అంతకుముందు, ఓవర్ నైట్ స్కోరు 61/1 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 54 పరుగులు మాత్రమే జోడించి 9 వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్నర్‌లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ల బౌలింగ్ దాడిని తట్టుకుని అసీస్ బ్యాటర్‌లు నిలువలేకపోయారు. జడేజా 7, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. కాగా, రెండో టెస్టు తొలిరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 262 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే, అసీస్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు మిగిలి ఉండగానే సునాయసంగా చేధించి విజయం సాధించింది.
addComments
Post a Comment