గుడివాడలో మొట్టమొదటగా "పూరిపాక"లో బార్ అండ్ రెస్టారెంట్.

 *- గుడివాడలో మొట్టమొదటగా "పూరిపాక"లో బార్ అండ్ రెస్టారెంట్* 


 *- రేకులషెడ్డులో మందుబాబులకు సిట్టింగ్ లు* 

 *- ఓపెన్ ప్లేస్ లోనూ మద్యం టేబుల్స్ ఏర్పాటు* 

 *- ఏలూర్ రోడ్డులోని బార్ లో బరితెగించేశారు* 

 *- గుడివాడకు "ప్రత్యేక మద్యం పాలసీ" వచ్చేసినట్టుంది* 

 *- "ప్రత్యేక పాలసీ" ధోరణిలోనే ఎక్కడా లేని విధంగా అనుమతులు* 


గుడివాడ, ఫిబ్రవరి 2 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో మొట్టమొదటగా "పూరిపాక"లో బార్ అండ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో మరెక్కడా పూరిపాకలో బార్ అండ్ రెస్టారెంట్ ను ఎవరూ చూసి ఉండకపోవచ్చు. గుడివాడ పట్టణంలోని ఏలూర్ రోడ్డుకు మాత్రం వస్తే పూరిపాకతో పాటు పక్కనే ఉన్న రేకుల షెడ్డులో కూడా బార్ అండ్ రెస్టారెంట్ మందుబాబులను కనువిందు చేయడాన్ని చూడొచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలంటే స్లాబ్ వేసిన భవనం తప్పనిసరిగా కలిగివుండాలి. పూరిపాకలు, రేకులషెడ్డుల్లో బార్ అండ్ రెస్టారెంట్ లను ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. గుడివాడ వంటి పట్టణంలో ఓపెన్ బార్ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రాలేదు. అయినప్పటికీ ఒకేచోట పక్కపక్కనే ఏర్పాటు చేసుకున్న పూరిపాక, రేకులషెడ్డు, ఓపెన్ ప్లేస్ లో మందుబాబుల కోసం సిట్టింగ్ లు వేసి మద్యాన్ని తెగ తాగించేస్తున్నారు. ఒక ప్రాంతంలోనే ఎక్కడపడితే అక్కడ మద్యం తాగుతూ కన్పించడాన్ని బట్టి గుడివాడ పట్టణానికి ప్రత్యేక మద్యం పాలసీ వచ్చేసిందనే అనుమానం కలుగకమానదు. ప్రభుత్వ మద్యం పాలసీ ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతులు ఇవ్వగా, ఏలూర్ రోడ్డులో మాత్రం నిబంధనలు ఏవీ పట్టనట్టుగా బరితెగించేశారు. గుడివాడకు ప్రత్యేక పాలసీ ధోరణిలోనే ఎక్కడా లేని విధంగా అనుమతులు కూడా ఇచ్చిపారేశారు. ఇంకోవైపు మున్సిపల్ అధికారుల ఎన్వోసి దగ్గర నుండి ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడం వరకు అంతా మేనేజ్ చేసి పారేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఏలూర్ రోడ్డులో నడిచేది బార్ అండ్ రెస్టారెంట్ అని అనాలో లేక గుడివాడ పట్టణానికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చుకుని ఏర్పాటు చేసుకున్నారని అనాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఏలూర్ రోడ్డులో ఇష్టానుసారంగా నడుపుతున్న బార్ అండ్ రెస్టారెంట్ విషయంలో సంబంధిత అధికారులు ఈ విధంగా వ్యవహరించడానికి కారణాలు మాత్రం అనేకం ఉన్నాయంటున్నారు. దీనిపై ప్రజల్లో కూడా అనేక అపోహలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో సంబంధిత ఎక్సైజ్ అధికారులైనా దృష్టిసారించి ప్రభుత్వ మద్యం పాలసీకి విరుద్ధంగా నడుస్తున్న ఏలూర్ రోడ్డులోని బార్ అండ్ రెస్టారెంట్ విషయంలో తగు చర్యలు తీసుకోవాలంటున్నారు. పూరిపాక, రేకులషెడ్డు, ఓపెన్ ప్లేస్ లో నడుస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ ను పరిశీలించి నిబంధనల ప్రకారం స్లాబ్ కల్గివున్న భవనంలోకి తరలించే ఏర్పాట్లు చేయాలని పలువురు సూచిస్తున్నారు. దీనిపై గుడివాడ ఎక్సైజ్ సీఐ నాగవాణిని వివరణ కోరగా ప్రభుత్వ మద్యం పాలసీ ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్ లు నడిచేలా చూస్తున్నామన్నారు. గుడివాడ పట్టణంలోని ఏలూర్ రోడ్డులో పూరిపాక, రేకులషెడ్డు, ఓపెన్ ప్లేస్ లో నడుస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ ను తనిఖీ చేస్తామని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. పూరిపాక, రేకులషెడ్డు, ఓపెన్ ప్లేస్ లో బార్ అండ్ రెస్టారెంట్ లను ఏర్పాటు చేయడానికి అనుమతులు లేవని ఎక్సైజ్ సీఐ నాగవాణి చెప్పారు.

Comments