ఈ ప్రాంత ప్రజల కలలు నిజం చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించాలని ఉద్దేశ్యంతో ఆలోచించారు.


సున్నపురాళ్ళపల్లె, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా (ప్రజా అమరావతి);


*కడప స్టీల్‌ ప్లాంట్‌కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, ఎంపీ ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, అభిమానానికి, ఆప్యాయతలకు, విశ్వాసానికి, విశ్వసనీయతకు, విధేయతకు నమ్మకమైన ఈ కడప గడ్డ మీద నిలబడి మాట్లాడే అదృష్టం కల్పించిన సీఎంగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. దాదాపు 15 సంవత్సరాల కల, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఒక స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టాలి, ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో స్టీల్‌ప్లాంట్‌ తీసుకురావాలని, ఈ ప్రాంత ప్రజల కలలు నిజం చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించాలని ఉద్దేశ్యంతో ఆలోచించారు.
2019లో సీఎంగా శ్రీ జగన్‌ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత డిసెంబర్‌ 23న నాడు శంకుస్ధాపన చేశారు కానీ తర్వాత జరిగన పరిస్ధితులు తెలుసు, కోవిడ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఇబ్బందులు, వీటి తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన జేఎస్‌డబ్యు గ్రూప్‌కి, సజ్జన్‌ జిందాల్‌ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ రోజు వైఎస్‌ఆర్‌ గారు ఈ ప్రాంతంలో స్టీల్‌ప్లాంట్‌ పెట్టాలని ఆలోచించినప్పుడు దానికి ఏ రకంగా అడ్డంకులు సృష్టించాలా అని కుయుక్తులు పన్నారో మీ అందరికీ తెలుసు. అప్పట్లో కొన్ని పత్రికలు ఏం రాశాయో మీ అందరికీ తెలుసు, పచ్చని కొండలు, గలగల పారే సెలయేర్లు, నాట్యం చేసే నెమళ్ళు, సహజసిద్ద ప్రకృతి వనాలు అని లేనిపోని రాతలు రాశారు, కానీ వైఎస్‌ఆర్‌ గారు అసెంబ్లీలో చెప్పారు ఇది తొండలు కూడా గుడ్లు పెట్టని చోటుపై ఈ రకంగా మా ప్రాంతం అభివృద్ది చెందకూడదని కుయుక్తులు పన్నారని చెప్పారు. ఈ రోజు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇక్కడ ఎదుర్కునే వ్యక్తి శ్రీ జగన్‌ గారు, ఆయన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు, నాడు తండ్రి వైఎస్‌ఆర్‌ గారు కన్న కలను సాకారం చేస్తున్న గొప్ప నాయకుడు శ్రీ జగన్‌ గారు. దాదాపు రూ. 8500 కోట్ల పెట్టుబడితో 25000 మందికి ఉపాధి కల్పించి ఈ ప్రాంతాన్ని ఉక్కునగరంగా తయారుచేస్తున్నారు, నేను విశాఖ నుంచి వచ్చాను, విశాఖను ఉక్కునగరంగా పిలుస్తున్నారంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కారణం, మరి రాబోయే రోజుల్లో ఈ జిల్లా కూడా వైఎస్‌ఆర్‌ కడప ఉక్కునగరంగా అవతరించబోతుంది. దానికి దోహదపడిన నాయకులు శ్రీ జగన్‌ గారు. కడప జిల్లా ప్రజలకు ఇంత గొప్ప కుటుంబాన్ని రాష్ట్రానికి అందించిన మీ అందరికీ రెండు చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, రానున్న రోజుల్లో మరింతగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్దికి సీఎంగారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తాం, జేఎస్‌డబ్యు గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సెలవు. 


*వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎంపీ, కడప*


అందరికీ నమస్కారం, మన ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఈ రోజు సాకారమవుతుంది. 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ తేవాలని సంకల్పించారు. ఆయన మరణించిన తర్వాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా పనులు ఆగిపోయాయి. కానీ ఇవాళ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎంతో శ్రమతో జేఎస్‌డబ్యు వంటి పెద్ద గ్రూప్‌ ను ఒప్పించి ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసుకుంటున్నాం. సరిగ్గా రెండు మూడేళ్ళలో ఈ స్టీల్‌ ప్లాంట్‌ పనులు అన్ని పూర్తయి దాదాపు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు రాబోతున్నందుకు నిజంగా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ కల సాకారం కావడానికి ఎంతో కృషిచేసిన సీఎంగారికి మన జిల్లా ప్రజల తరపున మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా జేఎస్‌డబ్యు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ గారికి ఏడాదికి మూడు మిలియన్‌ టన్నుల కెపాసిటీతో ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణం. ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమ వల్ల ముఖచిత్రమే మారిపోతుంది. జమ్ములమడుగు, ప్రొద్దుటూరు మాత్రమే కాదు ఈ జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి, జిల్లా సర్వతోముఖాభివృద్ది చెందుతుంది. ఈ ప్లాంట్‌కు కావాల్సిన మౌలిక వసతులను కూడా సీఎంగారు దాదాపు రూ. 700 కోట్లు వెచ్చించి కల్పిస్తున్నారు, హైవే నుంచి ఈ ప్లాంట్‌కు రోడ్‌ కనెక్టివిటీ ఇప్పిస్తున్నారు, రైల్‌ కనెక్టివిటీ ఇప్పిస్తున్నారు, మైలవరం డ్యామ్‌ నుంచి ప్రతి ఏడాదికి రెండు టీఎంసీలు వాడుకునేలా పైప్‌లైన్‌ నిర్మిస్తున్నారు, ఇవన్నీ కూడా రాబోయే రెండేళ్ళలో జరగబోతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ధ్యాంక్యూ.

Comments