ఎడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్* - *చెన్నైలో ఇన్వెస్టర్స్ సదస్సు
విజయవాడ (ప్రజా అమరావతి);


*ఎడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్* - *చెన్నైలో ఇన్వెస్టర్స్ సదస్సు*


*ఫిబ్రవరి 17న చెన్నైలో రోడ్ షో*


*పెట్టుబడుల వేటలో ఆంధ్రప్రదేశ్*


మార్చి3-4వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 ను విజయవంతం చేసేందుకు,  ఎడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే  2023 ఫిబ్రవరి 14 న బెంగుళూరు వేదికగా రోడ్ షో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  2023 ఫిబ్రవరి 17న తమిళనాడులోని చెన్నైలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. అంతకుముందు 31 జనవరి,2023న దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా విజయవంతంగా కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించింది. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా తెలిపి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది.  


రాష్ట్ర అనుకూల పారిశ్రామిక విధానాలు, విస్తృతమైన మౌలిక సదుపాయాలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ లకు అందిస్తున్న ప్రోత్సాహం, స్నేహపూర్వకమైన పారిశ్రామిక వాతావరణం వంటి అంశాలను పెట్టుబడిదారులకు తెలిపేందుకు ఎడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ - విస్తారమైన వనరులు, అపారమైన అవకాశాల పేరుతో వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ డ్రైవ్ లను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్న విషయాన్ని స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలతో వెల్లడిస్తోంది.  


గణనీయమైన ఉత్పాదకత, ఆకర్షించే మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల విధానాలు, పెద్ద సంఖ్యలో ప్రతిభా, నైపుణ్యాలు గలిగిన యువత, దేశ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రం పోషిస్తున్న కీలకపాత్ర గురించి, దక్షిణ భారతదేశంలో రాష్ట్ర ప్రాముఖ్యత, రాష్ట్ర పారిశ్రామిక విధానాల ప్రత్యేకత వంటి అంశాలను సమ్మిట్ వేదికగా ద్విగుణీకృతం చేయనుంది. 


ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ, తయారీ రంగం, ఫార్మాసూటికల్స్, ఆటోమొబైల్,పర్యాటకం మరియు విద్యుత్ రంగాల్లో  అందిస్తున్న ప్రోత్సాహాన్ని,  రాష్ట్రంలో సహజ సిద్ధంగా ఉన్న విస్తారమైన వనరులు, అవకాశాల గురించి సమ్మిట్ లో పరస్పర చర్చలకు అవకాశం కల్పించి ప్రభావవంతమైన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధుల సమక్షంలో వెల్లడించనుంది. 


స్టేక్ హోల్డర్స్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా గత మూడేళ్లుగా సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) లో మొదటి స్థానం సంపాదించడం, 2021-22లో 11.43 శాతంతో జీఎస్డీపీలో దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు నమోదు కావడం, పటిష్టమైన మారిటైమ్ మౌలిక సదుపాయాలు, 974 కి.మీల సముద్ర తీరంతో దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం, ఇప్పటికే ఉన్న 6 పోర్టులు, రాబోయే 4 పోర్టులతో ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ ఉందనే విషయాన్ని సభా వేదికగా వెల్లడించనుంది. ఇప్పటికే లాజిస్టిక్స్ లో లీడ్స్ అవార్డు-2022, విద్యుత్ లో ఎనర్షియా అవార్డు-2022, పోర్ట్ లెడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు లో ఈటీ అవార్డు 2022 లు సొంతం చేసుకున్న విషయాన్ని, సాధించిన క్రమాన్ని వివరించే ప్రయత్నం చేయనుంది. అదే విధంగా దేశంలోని 11 పారిశ్రామిక కారిడార్లలో 3 పారిశ్రామిక కారిడార్లు ఆంధ్రప్రదేశ్ కే చెందినవి కావడం, పారిశ్రామిక కేంద్రీకృత విధానాలు వంటి ప్రాధాన్యత గల అంశాలతో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా అందించనుంది. ప్రధానంగా రాష్ట్రంలోని అవకాశాలను ఉపయోగించుకొని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మరింతగా సహకరించాలని స్పెషల్ డ్రైవ్ ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది.


Comments