సిజేరియన్ చేసేముందు స్వీయ నియంత్రణ అవసరం





 సిజేరియన్ చేసేముందు స్వీయ నియంత్రణ అవసరం



ఆసుపత్రుల్ని నైతిక విలువలతో నడపాలి


ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల గైనకాలజిస్టులు, నిర్వాహకులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు ప్రత్యేక సమావేశం


అధిక సిజేరియన్ ప్రసవాలు చేస్తే ఆరోగ్య శ్రీ గుర్తింపు రద్దు చేస్తాం



అమరావతి (ప్రజా అమరావతి): సహజసిద్ధమైన రీతిలో ప్రసవాలు జరిగేలా డాక్టర్ లు అవగాహన కల్పించాలని, తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడే తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్ కు ఉపక్రమించాలని  వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు గైనకాలజిస్టులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు హితవు పలికారు.  మంగళగరి ఎపిఐఐసి భవనం ఆరో ఫ్లోర్ లోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

తల్లీబిడ్డల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెలగాలని సూచించారు.  

ధనార్జనే ధ్యేయంగా ఆసుపత్రుల్ని నడపొద్దని హితవు పలికారు. అధిక సిజేరియన్ ప్రసవాలు చేస్తే ఆరోగ్య శ్రీ గుర్తింపు రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రతి పదివేల మందికి 19.5 శాతం మంది డాక్టర్లున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. ప్రసవాల నిర్వహణలో  గైనకాలజిస్టులు , అనస్థీషియన్లు అందుబాటులో వుంచాలని సూచించారు. అధిక సిజేరియన్ ఆపరేషన్లు చేసే ఆసుపత్రున్ని ఆడిట్ చెయ్యాలని  వీసీలో పాల్గొన్న డిఎంహెచ్వోలను ఆయన ఆదేశించారు.   భవిష్యత్తులో సిజేరియన్ ఆపరేషన్లు గణనీయంగా తగ్గాలనీ, డబ్ల్యు హెచ్వో నిబంధనల ప్రకారం 10 నుండి 15 శాతం మేర మాత్రమే సిజేరియన్లు జరగాలన్నారు.  

ప్రసూతి సేవలలో భాగంగా వున్న సిజేరియన్ శ్రస్త్రచికిత్సలను కట్టడి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.    ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామన్నారు.   2500, లేదా 3 వేల మంది జనాభా వున్న ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో వైద్య సేవలందించేందుకు బియస్సీ నర్సింగ్ పట్టభద్రులను ఎంఎల్ హెచ్ పిలుగా నియమించామని, వారితో పాటు ఇద్దరు ఎన్ఎంలు, నలుగురు లేదా ఐదుగురు ఆశా కార్యకర్తలతో కూడిన బృందం సచివాలయంలో వున్న వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలోనూ,  అవసరమైన వారికి ఇంటి ముంగిట్లోనూ  సేవలందిస్తుందన్నారు. ఈ పరిధిలోఏ సమయంలోనైనా ముప్ఫయ్ లేదా నలభై మంది గర్భిణులు వుంటారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. వారికి గర్భధారణ ఆరంభం నుండి సరైన కౌన్సెలింగ్ తో పాటు పోషకాహారాన్ని అందచేసి సరైన పర్యవేక్షణ కొనసాగిస్తే వారికి సిజేరియన్ అవసరం లేని ప్రసూతి సౌకర్యాలను అందించి సుఖ ప్రసవాలకు సహకరించవచ్చని ఆయన చెప్పారు.  సంక్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే వారిని సిజేరియన్ శ్రస్త్రచికిత్సలకు తరలించాలని ఆయన సూచించారు.  నొప్పులు ఎక్కువగా వున్నాయనో, గర్భిణికి సురక్షిత ప్రసవం కావాలన్న వత్తిడి తోనో సిజేరియన్ కు మళ్ళించరాదని ఆయన స్పష్టం చేశారు. ముహూర్తాలు, తేదీలను పరిగణనలోకి తీసుకుని సిజేరియన్ చేపట్టడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత డాక్టర్ లపై వుందన్నారు.   ఈ అంశంపై గ్రామస్థాయిలో ముందుగా అక్కడి సిబ్బందికి శిక్షణనిచ్చి వారి ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా ఎంఎల్ హెచ్ పిలుగా నియమితులైన నర్సింగ్ గ్రాడ్యుయేట్లపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా వుందన్నారు.  ఇంకా ఈ సమావేశంలో ఆరోగ్య శ్రీ సిఇవో ఎం.ఎన్. రేందిర ప్రసాద్ , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ తో పాటు 

 డిఎంఇ మరియు ఎపివివిపి కమీషనర్ డాక్టర్ వినోద్ కుమార్,  అడిషనల్ డైరెక్టర్ (ఎంసిహెచ్) డాక్టర్ కెవిఎన్ఎస్ అనిల్ కుమార్ కూడా వర్చువల్ గా పాల్గొన్నారు.


*జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్*


అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో క్రిష్ణబాబు మాట్లాడుతూ ఎన్సీడీ, సీడీ సర్వే పూర్తి చేయాలని సూచించారు.  అన్ని విలేజ్ సెక్రటేరియట్ లలో ప్రభుత్వం ఆధార్ సెంటర్ లు పెట్టిందని, ప్రజలందరూ వీటిని ఉపయోగించుకొని ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేసుకోవాలన్నారు. 

ఎంఎల్ హెచ్ పీలు , ఎఎన్ఎం సేవల్ని సరిగా వినియోగించుకోవాలన్నొరు. వారు రోజూ ఇరవై కుటుంబాల్ని కవర్ చేసేలా చర్యలు తీసుకోవాలని, మధుమేహం, బీపీలకు మన దగ్గర మందులు తీసుకుంటున్నారా లేదా ప్రైవేటు డాక్టర్ ల దగ్గర మందులు తీసుకుంటున్నారా అనే సమాచారం కలిగి వుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా మందులు తీసుకోని వారు ఎంత మంది వున్నారో చూసి ఇలాంటి వారికి కౌన్సెలింగ్ చెయ్యాలని సూచించారు.  ఫ్యామిలీ డాక్టర్ ఊళ్లకెళ్లినప్పుడు ఈ సమాచారం ఎంఎల్ హెచ్ పి వద్ద వుండాలన్నారు. దీన్ని నూటికి నూరు శాతం ఫ్యామిలీ డాక్టర్ నిర్ధారించుకోవాలని,  వారంలో ఒకరోజు ఔట్ రీచ్ కార్యక్రమాన్ని చెయ్యాలని సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ పిఎంజెవై రిజిస్ట్రేషన్ ప్రక్రియ నూరు శాతం పూర్తి చేయాలన్నారు. 1.78 కోట్ల రిజిస్ట్రేషన్ లకు గాను 1.1 కోట్ల రిజిస్ట్రేషన్ లు చేశారనీ, విలేజ్ వాలంటీర్లు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ లకు చెప్పామని వివరించారు. ఎంఎల్ హెచ్ పీలు‌‌, ఎఎన్ఎంలకు నిరంతరం శిక్షణ కొనసాగించాలని, సాధారణ ప్రసవాలు, సిజేరియన్ లపై కూడా వారికి అవగాహన కల్పించాలని సూచించారు.  డాక్టర్ సలహా మేరకే సిజేరియన్ పై తగిన నిర్ణయం తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. అలాగే క్యాన్సర్ చికిత్సపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.  ఈ నేపథ్యంలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలలో వున్న రీజినల్ క్యాన్సర్ సెంటర్ల ద్వారా మాస్టర్ ట్రయినర్ లను సమకూర్చుకోవాలని సూచించారు. సరైన స్క్రీనింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ఎంఎల్ హెచ్ పి, ఎఎన్ఎంలను ఎప్పుడు అడిగినా బిపి, సుగర్ వ్యాధులపై సమగ్ర సమాచారం అందించేలా తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర  నుండి పంపిణీ చేస్తున్న  వివిధ రకాల ఐఇసి మెటీరియల్ ను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.  అదే విధంగా గర్భిణిల రిస్క్ ఫ్యాక్టర్ గురించి కూడా ఎంఎల్ హెచ్ పి, ఎఎన్ఎంలు చెప్పగలగాలి.  బాలింతలు, అలాగే 10 నుండి 19 ఏళ్ళ మధ్య వయస్కులైన బాలికలలో రక్తహీనత శాతం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.  స్థిర అభివ్రుద్ధి లక్ష్యాలు (ఎస్ డిజి)పై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ద్రుష్టి సారిస్తున్నారని, దీనికి అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ క్షేత్ర సిబ్బంది వ్యవహరించాలని సూచించారు.  క్షేత్ర స్థాయిలో ప్రతి అంశానికి సంబంధించి ఎఎన్ఎంలు బాధ్యత వహించాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సూచించారు.  హై రిస్క్ గర్భిణుల విషయంలో మ్యాపింగ్ సక్రమంగా జరుగుతోందో లేదో తెలుసుకోవాలని సూచించారు. జిల్లాల్లో స్టాఫ్ నర్స్ ల ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, అలాగే డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కు ఇందుకు సంబంధించిన సమాచారం అందచేయాలన్నారు. మార్చి 1 తరువాత ఎప్పుడైనా సరే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించే అవకాశం వుందని చెప్పారు. అలాగే మార్చి 1తరువాత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారని గుర్తు చేశారు.  వీటన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో సవ్యంగా వుండేలా డిఎంఅండ్ హెచ్ ఓలు వ్యవహరించాలన్నారు.  సిహెచ్ సిలలో అదనపు డాక్టర్లు వున్నారో లేదో పరిశీలించాలని సూచించారు. 104 ఎంఎంయు వాహనాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి సిఇఓ ఆరోగ్యశ్రీ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో నెలకు రెండుసార్లు ఫ్యామిలీ డాక్టర్ పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, హ్యాబిటేషన్లు ఎక్కువగా వుంటే రెండు సార్ల కంటె ఎక్కువగా పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు, లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. వాహనాలు, డాక్టర్లు, సిబ్బంది  కొరత ఎక్కడా కన్పించరాదన్నారు.  నోటిఫైడ్ వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయాలని, అలాగే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  లింగ నిర్దారణ నిషేధ చట్టం సక్రమంగా అమలయ్యేలా డెకాయ్ ఆపరేషన్లు  చేపట్టాలన్నారు. సామాజిక చైతన్యం గల  ఎన్ జిఓలను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. ఎఆర్ టి రిజిస్ట్రేషన్లు నూరు శాతం జరిగేలా చూడాలన్నారు. సరోగసి విషయంలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే సంబంధిత ఆస్పత్రి రిజిస్ట్రేషన్ పై తగు చర్యలు తీసుకోవాలన్నారు.  సిహెచ్ సిలలో అదనంగా వుండే ఫ్యామిలీ డాక్టర్లు నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో వున్న పిహెచ్ సికి రిపోర్టు చేసేలా ఎపివివిపి కమీషనర్ చర్యలు తీసుకోవాలని క్రిష్ణబాబు ఆదేశించారు.  ఈ సందర్భంగా  జిల్లాలలో ఖాళీగా వున్న పోస్టులను వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె నివాస్ ఈ సందర్భంగా డిఎంహెచ్ ఓలకు సూచించారు. హైరిస్క్ గర్భిణుల రవాణా విషయంలో ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని సూచించారు.  సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించేలా యూనిసెఫ్ వారు రూపొందించిన ప్రచార పోస్టర్లను  ఈ సందర్భంగా క్రిష్ణబాబు ఆవిష్కరించారు. 


Comments