జగన్ ను ఏమని పిలవాలో కొడాలి నాని చెప్పాలి

 *- జగన్ ను ఏమని పిలవాలో కొడాలి నాని చెప్పాలి


 *- నీతివంతుడు, నిజాయితీపరుడని చెప్తారా* 

 *- మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 

 *- జగనాసుర రక్తచరిత్ర పోస్టర్ ఆవిష్కరణ* 


గుడివాడ, ఫిబ్రవరి 13 (ప్రజా అమరావతి): 16 నెలలు జైలు జీవితాన్ని గడిపిన జగన్మోహనరెడ్డిని ఏమని పిలవాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పాలని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 40ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు సొంతమని అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం చంద్రబాబును 420, నారా లోకేష్ ను 210 అంటూ పదేపదే దుర్భాషలాడుతూ వస్తున్నారన్నారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని, ఇప్పుడు కూడా జగన్మోహనరెడ్డిని నీతివంతుడు, నిజాయితీపరుడని చెబుతారా అని కొడాలి నానిని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం వివేకా హత్యపై గుడివాడ టీడీపీ కార్యాలయంలో పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ వివేకా హత్య కేసులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా వైఎస్ భారతి, జగన్మోహనరెడ్డిలదేనని సీబీఐ విచారణలో బయటకు రానుందన్నారు. ఈ హత్యను గతంలో ఏ విధంగా చిత్రీకరించారో రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. సాక్షి పత్రికలో చంద్రబాబే చేశారని దుర్మార్గంగా రాశారన్నారు. గొడ్డలి పోటుతో దుర్మార్గంగా, ఫ్యాక్షన్ తరహాలో వివేకాను హత్య చేశారన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జరిగిన కుట్రగా భావిస్తున్నానన్నారు. క్యారెక్టర్ ను అంచనా వేయకుండా రాష్ట్ర ప్రజలు జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేశారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగనాసుర రక్తచరిత్ర నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే 25 ఏళ్ళ కిందట జరిగిన ఎన్టీఆర్ మరణంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాడన్నారు. ఇటువంటి కొడాలి నానికి గుడివాడ ప్రజలు 20 ఏళ్ళుగా ఓట్లు వేసి గెలిపిస్తుండడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది దోచుకోవడానికి కాదని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారన్నారు. ఏ ఒక్క కుటుంబానికీ న్యాయం జరగలేదన్నారు. స్వార్ధం కోసం ఎంతకైనా తెగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు విజ్ఞతతో సరైన ఆలోచన చేయాలని మాజీ ఎమ్మెల్యే రావి కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి పార్టీ నేతలు ముళ్ళపూడి రమేష్ చౌదరి, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, పోలాసి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments