మట్టి తవ్వుకుపోతున్న వారిపై ప్రతాపం చూపించండి

 *- మట్టి తవ్వుకుపోతున్న వారిపై ప్రతాపం చూపించండి


 *- అధికారులకు నిరుపేదల ఇళ్ళే కనిపిస్తున్నాయా* 

 *- తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం* 

 *- దుర్మార్గాలు, అరాచకాలకు మూల్యం తప్పదు* 

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 



 గుడివాడ, ఫిబ్రవరి 6 (ప్రజా అమరావతి): రూ.కోట్ల విలువైన మట్టిని తవ్వుకుపోతున్న వారిపై అధికారులు తమ ప్రతాపం చూపించాలని, నిరుపేదల ఇళ్ళు మాత్రమే వారికి కనిపిస్తున్నాయా అంటూ కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక నాగవరప్పాడు కాల్వగట్టుపై ఇళ్ళను తొలగించేందుకు వెళ్ళిన మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాసితులు ప్రొక్లయిన్ కు అడ్డుగా కూర్చుని ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలను బలవంతంగా తొలగించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్ళ తొలగింపు సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రావి పార్టీ శ్రేణులతో కలిసి నాగవరప్పాడు కాల్వగట్టు ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులతో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ప్రత్యామ్నాయ స్థలాలు చూపించకుండా ఖాళీ చేయించడం దారుణమని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి విలేఖర్లతో మాట్లాడుతూ గత 25ఏళ్ళుగా నాగవరప్పాడు కాల్వగట్టుపై నిరుపేదలు ఇళ్ళు నిర్మించుకుని నివశిస్తూ వస్తున్నారని తెలిపారు. ఈ ఇళ్ళను దుర్మార్గంగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రామందని, ఎవరినీ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. చేసిన దుర్మార్గాలు, అరాచకాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కోర్టులను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై కొన్ని వందల కేసులు కోర్టుల్లో కొనసాగుతున్నాయన్నారు. కోర్టు ధిక్కరణ కేసులు కూడా ఉన్నాయని, వాటిపై ఎవరూ మాట్లాడరన్నారు. గుడివాడలో నిరుపేదలపై ప్రతాపం చూపిస్తున్నారన్నారు. కాల్వగట్టుపై నివశిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయంగా 45రోజుల్లో స్థలాలను చూపించాలన్నారు. ఆ తర్వాత పేదల ఇళ్ళను ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. గుడివాడ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, టౌన్ ప్లానింగ్ అధికారి నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2013లోనే కాల్వగట్టుపై ఆక్రమణలను తొలగించి, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇరిగేషన్ శాఖకు ఆయా స్థలాలను అప్పగించడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఆక్రమణలు జరగడంతో ఒక ప్రైవేట్ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు. ఆక్రమణదారులకు మూడు నెలల కిందటే నోటీసులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు, టీడీపీ మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, పంద్రాజు సాంబశివరావు, దాసు శ్యామ్, షేక్ సర్కార్, షేక్ జబీన్, షేక్ జానీ షరీఫ్, షణ్ముఖ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments