*చిన్న వ్యాపార సంస్థలకు విధించే పెనాల్టీలు తగ్గించడాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం
*
*జూన్ వరకు ఉన్న జీఎస్టీ బకాయిలలో భాగంగా ఏపీకి రూ.689 కోట్లు రావాల్సి ఉంది*
*49వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*
అమరావతి, ఫిబ్రవరి, 18 (ప్రజా అమరావతి); రాష్ట్రాలకు జూన్ వరకు ఉన్న బకాయిల చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు మరో రూ.689 కోట్లు జీఎస్టీ పరిహారం కింద రావాల్సి ఉందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. చిన్న వ్యాపార సంస్థలకు విధించే పెనాల్టీలు తగ్గించడం, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటులో రాష్ట్ర సూచనలను పరిగణనలోకి తీసుకోవడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం సూచించిన విధంగానే రూ.20 కోట్ల వ్యాపార పరిమణం ఉన్న సంస్థలు రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసినప్పుడు విధించే పెనాల్టీలను సవరించడానికి కౌన్సిల్ అంగీకరించినట్లు తెలిపారు. అలాగే అప్పిలెట్ ట్రిబ్యునల్స్‌లో తీసుకోవాల్సిన సవరణల కోసం మంత్రుల కమిటీ సూచనలను కౌన్సిల్ ఆమోదం తెలిపిందని. ఈ మంత్రుల కమిటీలో తానుకూడా సభ్యునిగా ఉన్నట్లు తెలిపారు. ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చోటు కల్పించడంతో పాటు, త్వరగా ఏర్పాటు చేయాలన్న సూచనలకు కౌన్సిల్ అంగీకారం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో శనివారం 49వ జీఎస్టీ కౌన్సిల్ భేటీకి ఆయన హాజరయ్యారు.
అంతకు ముందు డిసెంబర్ లో నిర్వహించిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగడం వలన నాటి అంశాలపైనే కేంద్రం కీలకంగా దృష్టి సారించినట్లు తెలిసింది.అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంకా రూ.16,982 కోట్లు బకాయిలున్నాయని, గతేడాది మే 31 వరకూ ఉన్న బకాయిలు ఇప్పటికే చెల్లించినట్లు కేంద్ర మంత్రి సీతారామన్ వెల్లడించినట్లు మంత్రి పేర్కొన్నారు. పెన్సిల్ , రబ్బర్ వంటి స్టేషనరీ పై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గించేందుకు కౌన్సిల్ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహార చట్టం, 2017 ప్రకారం ఐదేళ్లపాటు తాత్కాలికంగా అనుమతించదగిన మొత్తం పరిహార సెస్ బకాయిలను కేంద్రం క్లియర్ చేస్తున్నట్లు తెలిసింది. జీఎస్టీ కౌన్సిల్ సదస్సుకు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎన్. గుల్జర్ (ఆదాయపు పన్నులు), రాష్ట్ర పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఎం. గిరిజా శంకర్ తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment