*ఎపి వైద్య ఆరోగ్యశాఖ*
*టెలి మెడిసిన్ నిర్వహణలో దేశంలోనే ఎపి ఫస్ట్
*
*సేవల విస్తరణకు నిర్విరామంగా చర్యలు*
*ప్రస్తుతం రోజూ 60,000కు పైగా టెలికన్సల్టేషన్లు*
*ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె.నివాస్ వెల్లడి*
అమరావతి (ప్రజా అమరావతి): ప్రజలకు ఆధునిక వైద్య విధానాలను చేరువ చేసే టెలిమెడిసిన్ విధానం నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె.నివాస్ అన్నారు. టెలిమెడిసిన్ విధానాన్ని బలోపేతం చేసే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా రీజియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన వర్క్ షాప్ లో మంగళగిరి ఎపిఐఐసి భవనం నుండి ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ స్థాయికి చేరుకోవటానికి తీసుకున్న చర్యల్ని కూలంకషంగా వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు అనునిత్యం ఈ అంశంపై సమీక్షిస్తూ, సూచనలు, సలహాలిచ్చి మార్గనిర్దేశనం చేయటం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెలి కన్సల్టేషన్ సేవలను అన్ని పిహెచ్ సిలు, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లకు విస్తరించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27 టెలి మెడిసిన్ హబ్ లను ఏర్పాటు చేశామన్నారు. 8351 విలేజ్ హెల్త్ క్లినిక్ లలో కూడా ఈ సేవలు అందుబాటులో వున్నాయన్నారు. 1652 స్పోక్ కమ్ హబ్ సేవల్ని (1142 పిహెచ్ సిలు, 542 అర్బన్ పిహెచ్ సిలు) కూడా ప్రస్తుతం అందుబాటులో వున్నాయని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 60,000 టెలి కన్సల్టేషన్లు నమోదవుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 9.7 కోట్ల టెలి కన్సల్టేషన్ సేవలు నమోదు కాగా, అందులో 3.1 కోట్ల (32 శాతం) టెలి కన్సల్టేషన్ సేవలు ఎపిలోనే నమోదయ్యాయనీ, తద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందన్నారు. ఎపి ప్రభుత్వం 2019 నవంబర్ 7నుండి 330 పిహెచ్ సిలలో ఇ -సంజీవని పేరుతో టెలిమెడిసిన్ సేవల్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిందన్నారు. వీటితో పాటు ఆంధ్రా మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, సిద్ధార్ధ మెడికల్ కాలేజ్ విజయవాడ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలలో మూడు తెలిమెడిసిన్ హబ్ లను ఏర్పాటు చేశామన్నారు. టెలి మెడిసిన్ హబ్ ల ద్వారా స్పెషలిస్ట్ వైద్య సేవల్ని వీడియో విధానంలో సబ్ సెంటర్లు, పిహెచ్ సిలలోని రోగులకు అందిస్తున్నామన్నారు. ఆన్ లైన్ లోనే రోగులకు అవసరమైన మందులను సూచించే ప్రిస్క్రిప్షన్లను జారీ చేస్తున్నామన్నారు. ప్రతి టెలిమెడిసిన్ హబ్ లో ఒక జనరల్ పిజీషియన్, ఒక పెడియాట్రీషియన్, ఒక గైనకాలజిస్ట్, ఇద్దరు జనరల్ డ్యూటీ వైద్యాధికారులు పేషెంట్లకు టెలి కన్సల్టేషన్ సేవల్ని అందిస్తున్నారని నివాస్ వివరించారు. రాష్ట్రం అనునిత్యం ఈ కేంద్రాలలోని వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణనిస్తుండటం కూడా ఈ వైద్య సేవల మెరుగుదలకు మరింత దోహదపడుతోందన్నారు. జిల్లా ఆస్పత్రులు/ బోధనా ఆస్పత్రుల నుండి అందుబాటులో వున్న వైద్యుల్ని కూడా ఈ సేవలకు వినియోగించుకుంటున్నామన్నారు. ఖాళీగా వున్న పోస్టుల్ని ఎప్పటికప్పుడు భర్తీ చేసి రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నడపాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైద్య సేవల్ని ప్రజలకు మరింత చేరువచేసేందుకు సిఎంగారి నిర్ణయం దోహదపడిందన్నారు. ప్రస్తుతం అందుబాటులో వున్న 27 టెలి మెడిసిన్ హబ్ లతో పాటు 1684 స్పోక్ కమ్ హబ్ లను అందుబాటులోకి తెచ్చామన్నారు. టెలిమెడిసిన్ హబ్ లు, స్పోక్ కమ్ హబ్ లలోని సిబ్బందికి రెగ్యులర్ గా శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామన్నారు. సిబ్బంది, వైద్యులు అందిస్తున్న సేవలపై ప్రతిస్థాయిలోనూ నిత్యం సమీక్షిస్తుంటామన్నారు.
కోవిడ్ మహమ్మారి విరుచుకుపడిన సమయంలో టెలిమెడిసిన్ సేవలు విస్తృత స్థాయిలో ప్రజలకు ఉపయోగపడ్డాయని నివాస్ గుర్తు చేశారు. ఈ సమయంలో వచ్చిన కాల్స్ లో అధికశాతం భయాందోళనలతో కూడినవేనని, ఈ కాల్స్ కు స్పందించేందుకు అదనంగా మరికొంత మంది వైద్యాధికారులను నియమించామన్నారు. కొంతమంది రిజిస్టర్ చేసుకున్న డాక్టర్లకు మొబైల్ యాప్ ను కూడా కొవిడ్ సమయంలో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కేంద్రాలలోని డాక్టర్లు తమకు అందే కాల్స్ కు స్పందించటంతో పాటు వారే స్వయంగా కొంతమంది పాజిటివ్ పేషెంట్లకు ఫోన్ చేసి ఆరా తీసేవారని తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి ఇంటివద్దే అవసరమైన మందుల్ని అందించే ఏర్పాటు కూడా చేశామన్నారు. కోవిడ్ సమయంలో 6,11,014 మంది పౌరులకు సేవలందించామని, ఇందుకు గాను 6,145 మంది డాక్టర్లు నమోదుచేసుకున్నారని తెలిపారు. 13,74,698 కాల్స్ అందుకున్నారని, 84,650 కన్సల్టేషన్ గంటలు నమోదయ్యాయని వివరించారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) కింద రాష్ట్ర వ్యాప్తంగా పలు డిజిటల్ హెల్త్ యాప్ లు వినియోగంలోకి వచ్చాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వినియోగిస్తున్న టెలిమెడిసిన్ విధానాన్ని ఈ యాప్ లతో అనుసంధానించటం ద్వరా మెరుగైన ఫలితాలుంటాయని భావించి అన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చామని నివాస్ తెలిపారు. ఎబిహెచ్ ఎ ఐడి ద్వారా ఈ వేదికను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనితో పాటు టెలిమెడిసిన్ సేవలపై పేషెంట్ల నుండి ఫీడ్ బ్యాక్ ను కూడా ఆహ్వానించామని, తద్వారా ఈ విధానం అమలులో ఎదురయ్యే సమస్యలు, ఆటంకాలను గుర్తించి వాటిని అధిగమించటానికి ఇది ఉపయోగపడిందని తెలిపారు.
*దేశంలోనే ఎపి బెస్ట్ స్టేట్ :కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ జాయింట్ సెక్రెటరీ విశాల్ చౌహాన్ ప్రశంస*
ఇ -సంజీవని టెలిమెడిసిన్ సేవల్ని అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యుత్తమ పనితీరును కనపబర్చి దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ (పాలసీ) విశాల్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఎపిని ఆదర్శంగా తీసుకుని టెలిమెడిసిన్ సేవల్ని మరింత మెరుగైన రీతిలో అందించాలని ఆయన సూచించారు. టెలిమెడిసిన్ సేవల్ని దేశంలోని హెల్త్ వెల్ నెస్ సెంటర్ల ద్వారా 2018లోనూ, ఇ -సంజీవని ఓపిడి సేవల్ని 2020లోనూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. కోవిడ్ కష్టకాలంలో టెలికన్సల్టేషన్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నదని ఆయన గుర్తు చేశారు.
addComments
Post a Comment