జాతీయస్థాయిలో ఎస్సీ గురుకుల విద్యార్థుల జయకేతనంజాతీయస్థాయిలో ఎస్సీ గురుకుల విద్యార్థుల జయకేతనం


ఎన్ఎస్ఐసి పోటీల్లో పెదపావనికి ప్రధమ స్థానం

కార్పొరేట్ సంస్థల విద్యార్థులపై సునాయాస విజయం

మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, ఫిబ్రవరి 17 (ప్రజా అమరావతి): బెంగుళూరు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి నేషనల్ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ (ఎన్ఎస్ఐసి) పోటీల్లో ప్రకాశం జిల్లా పెదపావని ఎస్సీ గురుకులానికి చెందిన విద్యార్థులు సత్తాచాటి ప్రధమ స్థానాన్ని దక్కించుకున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.

ఈ-విద్యాలోక్, ఎల్ అండ్ టీ సంస్థలు సంయుక్తంగా ఈ జాతీయ స్థాయి పోటీలను నిర్వహించాయని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున చెప్పారు. యుఎన్ఓ ప్రామాణికంగా నిర్ధారించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఆధారంగా ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి ఈ-విద్యాలోక్, ఎల్ అండ్ టీ ఇచ్చిన ఓపెన్ ఛాలెంజ్ ను స్వీకరించి దేశవ్యాప్తంగా అనేక విద్యాలయాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి బృందాలు పలు ప్రెజెంటేషన్లను వివిధ స్థాయిల్లో సమర్పించాయని తెలిపారు. అయితే ఈ ప్రెజెంటేషన్లలో ఉత్తమమైనవిగా భావించిన 26 ప్రెజెంటేషన్లను జాతీయ స్థాయి పోటీల కోసం ఈ-విద్యాలోక్, ఎల్ అండ్ టీ సంస్థలు ఎంపిక చేయగా వీటిలో ఎస్సీ గురుకులాలకు చెందిన పెదపావని, గోపాలపురం(తూర్పుగోదావరి జిల్లా), నరసాపురం(కృష్ణా జిల్లా)లకు చెందిన విద్యార్థుల ప్రజంటేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విధంగా జాతీయస్థాయికి ఎంపిక చేసిన 26 విద్యార్థి బృందాలతో బెంగుళూరులో ఈనెల 15,16 తేదీల్లో జాతీయస్థాయి పోటీలను నిర్వహించారని వివరించారు. ఈ పోటీల్లో పెదపావనికి చెందిన విద్యార్థులు ‘సారంలేని మట్టితో హరిత విప్లవం’ అనే అంశంపై రూపొందించిన ప్రజంటేషన్ కు జాతీయ స్థాయిలో ఉత్తమమైనదిగా రూ.60 వేల నగదు పురస్కారాన్ని నిర్వాహకులు అందించారని నాగార్జున వెల్లడించారు. దేశంలోని ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాల్లో పేరెన్నిగన్న కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులతో, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ఎస్సీ విద్యార్థులు పోటీపడి, తమ ఇంగ్లీషు భాషా ప్రావీణ్యంతో అందర్నీ అలరించి జాతీయస్థాయిలో ప్రధమ విజేతలుగా నిలవడం ఎస్సీ గురుకులాలకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఎన్ఎస్ఐసి పోటీల్లో జయకేతనం ఎగురవేసి విజేతలుగా నిలిచిన పెదపావని విద్యార్థులు ఎ.సుష్మ, డి.మహిత, విద్యార్థులకు స్ఫూర్తి నిచ్చిన పెదపావని టీచర్ ఎ.దుర్గాభవాని, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.పావనమూర్తి, ఏఎంఓ ఎన్.సంజీవరావు తదితరులను మంత్రి  నాగార్జున అభినందించారు.


Comments