చంద్రబాబు గన్నవరం పర్యటనలో మాజీ ఎమ్మెల్యే రావి

 *- చంద్రబాబు గన్నవరం పర్యటనలో మాజీ ఎమ్మెల్యే రావి* 


 *- భారీగా తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు* 

 *- దాడికి గురైన టీడీపీ కార్యాలయం పరిశీలన* 

 *- వాహనాలకు నిప్పంటించడంపై ఆందోళన* 


గన్నవరం /గుడివాడ, ఫిబ్రవరి 24 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం గన్నవరంలో పర్యటించగా ఆయనతో పాటు ఇతర ముఖ్యనేతలతో కలిసి కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కూడా పాల్గొనడం జరిగింది. చంద్రబాబు రాకతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున గన్నవరానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌడీమూకలు రాళ్ళు, కర్రలతో జరిపిన దాడిలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబుతో కలిసి రావి పరిశీలించారు. వాహనాలకు నిప్పు అంటించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాడి జరిగిన తీరును చంద్రబాబుకు పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడి భయానక వాతావరణాన్ని సృష్టించడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేయడమేగాక వాహనాలను తగలబెట్టారన్నారు. అయినప్పటికీ టీడీపీ నేతలు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోలేదన్నారు. పోలీసులు అక్రమంగా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ధైర్యం చెప్పారన్నారు. న్యాయవాదులను కూడా అదుపులోకి తీసుకోవడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు తెలుగుదేశం పార్టీ రక్షణగా ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఉద్యమిస్తామన్నారు. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నా చంద్రబాబు సభలు విజయవంతమవుతూ వస్తున్నాయన్నారు. దీన్ని తట్టుకోలేకే గన్నవరం ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో తెలుగుదేశం పార్టీకి ప్రజల సహకారం అవసరమని చంద్రబాబు విజ్ఞప్తి చేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలకు సంక్షేమ పాలన అందించడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోందన్నారు. ఈ పాదయాత్రలో యువత పెద్దఎత్తున భాగస్వాములవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగేళ్ళుగా నిరుద్యోగం పెరుగుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు భరోసా కల్పిస్తూ అన్నివర్గాల ప్రజల సమస్యలను నారా లోకేష్ తెలుసుకోవడం జరుగుతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటేనే అన్నిరంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలను కల్పిస్తామని మాజీ ఎమ్మెల్యే రావి తెలిపారు.

Comments