జిల్లాలో ఈనెల 14న నిర్వహించనున్న డీ వార్మింగ్ డే (జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం) ను విజయవంతం చేయాలి

 

నెల్లూరు, మార్చి 9 (ప్రజా అమరావతి): జిల్లాలో ఈనెల 14న నిర్వహించనున్న డీ వార్మింగ్ డే (జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం) ను విజయవంతం చేయాల


ని, 1 నుంచి 19 సంవత్సరాలు మధ్య వయసు గల ప్రతి ఒక్కరూ నులిపురుగుల మాత్రలను వేసుకునేలా సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. 

 గురువారం సాయంత్రం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో ఈనెల 14న చేపట్టనున్న డీ వార్మింగ్ డే కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో విద్యార్థులందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని పేర్కొన్నారు.  అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థుల చేత ఈ మాత్రలను మింగించాలని, 1 - 2 వయసు గల చిన్నారులకు  మాత్రలను పౌడర్ చేసి అందించాలని, 3-19 వయసు గలవారు చప్పరించి మింగేలా అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడి, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.  ఈనెల 14న ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలకు హాజరై ఈ మాత్రలు తీసుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో నిర్దేశించిన సుమారు ఆరు లక్షల మందికి ఈ మాత్రలు అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్వో పెంచలయ్య మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి పాఠశాలలకు ఈ మాత్రలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. జ్వరం, విరేచనాలు, జలుబు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ మాత్రలు ఇవ్వకూడదని, అలాంటి విద్యార్థులను గుర్తించి ఆరోగ్య సమస్యలు తగ్గిన తర్వాత ఈనెల 18న వారికి ఈ మాత్రలు అందజేస్తామన్నారు. అలాగే మూడు నెలలు పైబడిన గర్భిణీలు ఆరోగ్య కార్యకర్తల పర్యవేక్షణలో ఈ మాత్రలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అందించే ఈ మాత్రలను నిర్లక్ష్యం వహించకుండా తప్పనిసరిగా తమ పిల్లలకు వేయించాలని ఆయన కోరారు. 

 అనంతరం డీ వార్మింగ్ డే పోస్టర్లను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. 

 ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చిరంజీవి, ఐసిడిఎస్ పీడీ సౌజన్య, సమగ్ర శిక్ష పిఓ ఉషారాణి, ఆర్ ఐ ఓ వరప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటయ్య, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి కనకదుర్గా భవాని, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ శిద్ధా నాయక్, ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. 


Comments