చంద్రబాబు నిర్ణయంపైనే కైకలూరు అసెంబ్లీలో టీడీపీ భవితవ్యం.

 *- చంద్రబాబు నిర్ణయంపైనే కైకలూరు అసెంబ్లీలో టీడీపీ భవితవ్యం* 


 *- పిన్నమనేని కుటుంబమైతే గెలుపు ఖచ్చితమన్న అభిప్రాయం*

 *- అవినీతి, అక్రమాలకు దూరంగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం*

 *- దశాబ్దాల పాటు పిన్నమనేని చుట్టూనే తిరిగిన పదవులు*

 *- రాజకీయ మంత్రాంగానికి పట్టం కడుతూ వస్తున్న ప్రజానీకం*

 *- పిన్నమనేని కుటుంబానికి ప్రజల్లో ఏ మాత్రం తగ్గని ఆదరణ*

 *- ముదినేపల్లి స్థానంలో కైకలూరు నుండి దిగుతున్నట్టుగా ప్రచారం*

 *- నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 14 ఏళ్ళ నిరీక్షణకు ఫలితం* గుడివాడ, మార్చి 1 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్ణయంపైనే ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. కైకలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి జరిగిన ఈ పరిణామంతో కైకలూరు తెలుగుదేశం పార్టీలో అనిశ్చితి ఏర్పడింది. దీంతో జయమంగళ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుండి తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోలేదు. ఈలోగా కైకలూరు టీడీపీకి జయమంగళ రూపంలో గట్టి ఎదురుదెబ్బే తగిలినట్టయింది. దీని ప్రభావం 2024 ఎన్నికలపై పడే అవకాశాలు కూడా స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కైకలూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే జయమంగళ రాజీనామాతో ఏర్పడిన అగాధాన్ని పిన్నమనేని కుటుంబం సహకారంతో పూడ్చే పనిలో చంద్రబాబు నిమగ్నమైనట్టుగా చెబుతున్నారు. జయమంగళ తెలుగుదేశం పార్టీని వీడిన వెంటనే పిన్నమనేని కుటుంబం నుండి మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, సీనియర్ టీడీపీ నేత పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జి)లు రంగంలోకి దిగారు. కష్టకాలంలో కైకలూరు టీడీపీని భుజాన మోసేందుకు ముందుకు వచ్చారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబును కూడా కలిసి టీడీపీ సీటు కేటాయిస్తే కైకలూరు అసెంబ్లీ నుండి పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పేశారు. ఈ సందర్భంగా పిన్నమనేని కుటుంబానికి కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కైకలూరు అసెంబ్లీ నుండి పిన్నమనేని కుటుంబమైతే తెలుగుదేశం పార్టీ గెలుపు ఖచ్చితమన్న అభిప్రాయం కూడా నియోజకవర్గ ప్రజల నుండి వినిపిస్తోంది. అవినీతి, అక్రమాలకు దూరంగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యాన్ని పిన్నమనేని కుటుంబం కల్గివుంది. దశాబ్దాల పాటు అనేక ఉన్నత పదవులు ఈ కుటుంబం చుట్టూనే తిరిగాయి. ప్రజలు కూడా పిన్నమనేని మంత్రాంగానికి కడుతూనే వచ్చారు. దాదాపు 5 దశాబ్దాలకుపైగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు దగ్గర నుండి మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు వరకు పిన్నమనేని కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజనలో రద్దయిన ముదినేపల్లి స్థానంలో కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జిలలో ఒకరిని పోటీకి దింపుతున్నట్టుగా టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నంత వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగిన పిన్నమనేని కుటుంబం గత 14 ఏళ్ళుగా పోటీ చేసేందుకు మరో అసెంబ్లీ నియోజకవర్గం కోసం నిరీక్షిస్తూ వస్తోంది. జయమంగళ వైసీపీలోకి వెళ్ళిపోవడంతో ఏర్పడిన ఆనిశ్చితిని పిన్నమనేని కుటుంబంతో భర్తీ చేస్తే మాత్రం 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుండి 2024 ఎన్నికల్లో గెలుపు దిశగా పయనించి కైకలూరు సీటును తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందన్న అంచనాలతో ఆ పార్టీ పూర్వవైభవం దిశగా ముందుకు సాగుతోంది.

Comments