ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
- మన బాధ్యతే అది కదా
- గ్రామ సచివాలయ సిబ్బందితో ఎంపీ భరత్
- 34వ వార్డు శేషయ్య మెట్టలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో..
రాజమండ్రి, మార్చి 21 (ప్రజా అమరావతి): ప్రజా సమస్యలు మీరూ, మేమూ పట్టించుకోకపోతే ఎలా..గత కొన్ని రోజులుగా సక్రమంగా తాగునీటి సరఫరా కావడంలేదంటున్నారు..కారణం ఏంటని సంబంధిత శాఖ సచివాలయ ఉద్యోగులను, నగర పాలక సంస్థ సిబ్బందిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని 34వ వార్డు త్రీ టౌన్ పోలీసు స్టేషను శేషయ్య మెట్ట నుండి నిర్వహించిన 'గుడ్ మార్నింగ్ రాజమండ్రి' కార్యక్రమంలో ఎంపీ పాల్గొని ప్రజా సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కుళాయి వాటర్ సరఫరా గతంలో గంట పాటు ఇచ్చేవారని, ప్రస్తుతం అర గంట మాత్రమే సరఫరా కావడం వల్ల మంచినీళ్ళకు ఇబ్బందిగా ఉంటోందని పలువురు మహిళలు ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడే ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగిని ఈ విషయమై ప్రశ్నించారు. జీతం తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టు న్యాయం చేయాలి కదా..మీ మీద సీఎం జగనన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..మీరిలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా సత్వరమే చర్యలు తీసుకోమని ఎంపీ భరత్ ఆదేశించారు. ఇరిగేషన్ గేట్లు పాడవటంతో గోదావరి నీరు లీకేజ్ అయి తరచూ తమ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని పలువురు ఎంపీ భరత్ దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ ఎస్ఈ పాండురంగారావు ఈ సమస్యపై ఎంపీకి వివరించగా..వెంటనే ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కొత్త గేట్లకు ఎస్టిమేషన్ వేసి పంపామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వర్షాకాలం రాకుండా పనులు ప్రారంభిస్తే బాగుంటుందని సంబంధిత శాఖ అధికారులకు ఎంపీ భరత్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ ఇన్చార్జి అడపా శ్రీహరి, 34వ వార్డు ఇన్చార్జి పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, అనుసూరి పద్మలత, సప్పా ఆదినారాయణ, దొమ్మేటి సత్యనారాయణ (పెద్ద), కాటవం రాజు, మారే సతీష్, కర్రి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment