సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి



సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి


అంబేద్కర్ స్మృతివనం పనులపై రాష్ట్ర మంత్రుల సమీక్ష

అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రులు

అమరావతి, మార్చి 17 (ప్రజా అమరావతి): అంబేద్కర్ స్మృతివనం పనుల్లో అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని, విగ్రహ నిర్మాణపనుల్లో వేగం పెంచాలని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. స్మృతివనంలో చేపడుతున్న పనుల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనల ప్రకారంగానే స్మృతివనాన్ని తీర్చిదిద్దాలని కోరారు.

రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మేరుగు నాగార్జున తో పాటుగా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు అంబేద్కర్ స్మృతివనం పనులను సమగ్రంగా సమీక్షించారు. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి జయలక్ష్మి అంబేద్కర్ స్మృతివనం పనులకు సంబంధించిన పురోగతిని వివరించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని కోరారు. ఢిల్లీలో ఇప్పటికే తయారైన విగ్రహం విడిభాగాలను రాష్ట్రానికి త్వరితగతిన తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం కాళ్ల కింది భాగాన నిర్మించే భవనంలో వ్యాపారాత్మకమైన కార్యక్రమాలు కాకుండా అంబేద్కర్ కు సంబంధించిన ఫోటోగ్యాలరీ, ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన శిల్పాలు, అంబేద్కర్ జీవితానికి సంబంధించిన పుస్తకాలతో కూడిన గ్రంధాలయాలను ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన అంబేద్కర్ జీవిత చిత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరించే పనిలో ఆలస్యం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అంబేద్కర్ స్మృతివనం ఆవరణలో సందర్శకులకు అవసరమైన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. యాంపీ థియేటర్ స్థానంలో మినీ థియేటర్ ను ఏర్పాటు చేసి వాటిలో అంబేద్కర్ తో పాటుగా ఇతర స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన చిత్రాలను కూడా ప్రదర్శించాలని అధికారులు చేసిన సూచనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించి తుదినిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్మృతివనం ఆవరణలో రెస్టారెంట్, వాహనాల పార్కింగ్ కు సంబంధించిన భవనాల నిర్మాణాలు కూడా చేపట్టాలన్నారు. అంబేద్కర్ స్మృతివనం చుట్టూ ఉండే ఫుట్ పాత్ ను కూడా ముఖ్యమంత్రి సూచించిన విధంగా అందంగా తీర్చిదిద్దాలని, స్మృతివనం ఆవరణలో సాధారణ వాటర్ ఫౌంటెన్లు కాకుండా మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని నాగార్జున అధికారులకు సూచించారు. అంబేద్కర్ స్మృతివనం ఆవరణలో చేపడుతున్న వివిధ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని దీని కోసం ప్రస్తుతం అక్కడ వినియోగిస్తున్న కార్మికుల సంఖ్యను అవసరమైన మేరకు వెంటనే పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం పనుల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. కన్వెన్షన్ సెంటర్, విగ్రహ నిర్మాణం, పెడెస్టల్, ప్రహారీ గోడల నిర్మాణ పనులను ఈ సందర్భంగానే మంత్రుల పరిశీలిచి పరిశీలించి అధికారులకు పలు  సూచనలు చేసారు. ఈ సమావేశంలో సోఫియల్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ అదితి సింగ్, ఏపీఐఐసి సిఇ నరసింహారావు, కేపీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments