ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా సీఎం జగనన్న అడుగులు

 ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా సీఎం జగనన్న అడుగులు 

* విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

’* రాష్ట్ర వ్యాప్తంగా  18 న మరోవిడత పంపిణీ 

* చినకాకానిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని  


అమరావతి (ప్రజా అమరావతి): అత్యంత ప్రతిష్టాత్మకమైన  ఫ్యామిలీ డాక్టర్‌ పథకం ఏప్రిల్‌ 6న రాష్ట్రంలో ప్రారంభం కాబోతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని, ఇప్పటికే ట్రయల్‌ రన్‌ మొదలయిందని ఆమె చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా  గుంటూరు జిల్లా చినకాకాని ప్రభుత్వ ఉన్నత  పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రజిని మాట్లాడారు. గ్రామ సచివాలయాల పరిధిలో 2000కు పైగా జనాభా ఉన్న గ్రామాలకు వైద్యులు వచ్చి, అక్కడి రోగులకు  వివిధ పరీక్షలు చేసి, చికిత్సలు అందిస్తారని తెలిపారు. మందులు  పంపిణీ చేయడంతో పాటు రోగుల వ్యాధి రికార్డులను ఎలక్ట్రానిక్‌ రూపంలో పదిలపర్చి, తర్వాతి వైద్య సేవలనూ కొనసాగిస్తారని మంత్రి చెప్పారు. ప్రతి పల్లెలో మంచం మీది నుంచి లేవలేని రోగుల ఇళ్ల ముంగిటికే ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు అందుతాయని తెలిపారు.  ఈ సేవల్లో భాగంగా వైద్యులు గ్రామాల్లోని పాఠశాలలనూ సందర్శించి, విద్యార్థులకు,  అంగన్‌ వాడీ కేంద్రాల్లోని పిల్లలకూ వైద్య సేవలను అందిస్తారని తెలిపారు. నాడు –నేడు పథకం కింద పాత ఆస్పత్రి భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్త భవనాలనూ నిర్మిస్తున్నామని మంత్రి రజిని చెప్పారు. రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను తెచ్చామని, మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి 

అడుగులు వేస్తున్నారని ఆమె తెలిపారు.

నులిపురుగుల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా మాత్రల పంపిణీ

  విద్యార్థుల్లో నులిపురుగుల వ్యాధి నివారణకు మాత్రలు పంపిణీ చేస్తున్నామని,  ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్కులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నామని తెలిపారు. పిల్లలకు ఏదైనా అనారోగ్యం సోకితే ఇంట్లో తల్లిదండ్రులకు ఆందోళనగా ఉంటుందన్నారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని మంత్రి చెప్పారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల నులిపురుగులను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మాత్రలు పొందలేని చిన్నారులకు మళ్లీ  ఈనెల 18న అందించడానికి తమ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉంటేనే వారి చదువులు బాగుంటాయని  ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి భావిస్తారని, చిన్నారుల ఆరోగ్యం కోసం జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నారని మంత్రి తెలిపారు. పిల్లల్లో ఎదుగుదలకు ఈ పోషకాహారం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన ఒక మెనూ ప్రకారం ఈ పోషకాహారం క్రమం తప్పకుండా అందిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమానికి అనేక చర్యలు చేపడుతున్నారని రజిని చెప్పారు. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌ సంఖ్య 3255కు పెంచిన ఘనత కూడా ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. చికిత్సా సమయంలో వేతనాన్ని కోల్పోయే దినసరి కూలీలకోసం ఆరోగ్య ఆసరా కింద ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది తమ ప్రభుత్వమేనని మంత్రి రజిని తెలిపారు.

డైరెక్టర్ హెల్త్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి, ఆర్బీఎస్కే డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments