*ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రహసనంగా మార్చేశారు*
*బోగస్ ఓట్లను అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం*
*అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలు, ఏజెంట్లను అరెస్టు చేయడం దారుణం*
*పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఎప్పటికప్పుడు చంద్రబాబు ఫోన్లు*
*చర్యలకు డిమాండ్*
*పార్టీ కార్యాలయంలోని వార్ రూం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు నాయుడు సమీక్ష*
అమరావతి (ప్రజా అమరావతి) : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ నేతలు, అధికారులు కలిసి ప్రహసనంగా మార్చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ పక్క బోగస్ ఓట్లు, మరోవైపు టీడీపీ నేతలు, ఏజెంట్ల అరెస్టులతో ఎన్నికలల్లో నిబంధనలను, రాజకీయ పక్షాల హక్కులను పూర్తిగా పాతర వేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై పార్టీ కార్యాలయం లోని వార్ రూం లో ఉదయం నుంచి మినిట్ టు మినిట్ సమీక్ష చేశారు. పార్టీ నేతలు, జిల్లాలలో ఉన్న ఇంచార్జ్ లు, అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో ఘటనలపై అధినేతకు వివరించారు. పార్టీ నేతలు అక్రమాలపై రియల్ టైంలో సమాచారం అందించారు. ఆయా ఘటనలపై కడప, తిరుపతి, ప్రకాశం జిల్లా ఎస్పీలతో, తిరుపతి జిల్లా కలెక్టర్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ఉల్లంఘనలను అధికారులకు వివరించి తక్షణ చర్యలకు డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో యధేచ్చగా వైసిపి వారు దొంగ ఓట్లు వేస్తున్నా...అధికార పార్టీ నేతలు దాడులు, అక్రమాలకు పాల్పడుతున్నా పోలింగ్ అధికారులు అడ్డుకోకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ఇంత అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు దిగకపోవడం దారుణం అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలపై ఎలక్షన్ కమిషన్ కు ఎప్పటికప్పుడు వరుసగా ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా తిరుపతిలో బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉండడం పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తూర్పు పట్టభద్రుల నియోజకవర్గంలో ఏకంగా అభ్యర్థినే వైసిపి గూండాలు అడ్డకోవడాన్ని చంద్రబాబు ఖండించారు. తిరుపతిలో దాడులు, అక్రమాలపై ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా సరిగా స్పందించ లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఓటువేయాల్సిన ఎన్నికల్లో అనర్హులతో, నిరక్షరాస్యులతో బోగస్ ఓట్లు వేయించినా అధికారులు కనీస బాధ్యతగా వ్యవహరించకపోవడం సరికాదన్నారు. అధికార పార్టీ ఓటమి భయంతోనే ఈ స్థాయి అక్రమాలకు దిగిందని చంద్రబాబు ఆరోపించారు. గతం లో ఎన్నడూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థాయి అక్రమాలు చూడలేదని చంద్రబాబు అన్నారు. వార్ రూం మీటింగ్ లో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు,బోండా ఉమా, వర్ల రామయ్య తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
addComments
Post a Comment