విశాఖలోని పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు:డిప్యూటీ సియం
అమరావతి,20 మార్చి (ప్రజా అమరావతి):విశాఖపట్నంలో గత 22 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న పంచ గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయశాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.సోమవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకు మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్టణం లోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనర్సింహ స్వామి భూములను పరిరక్షించేందుకు అన్నిచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.అక్కడ నెలకొన్న పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి సంబంధించి అటు దేవస్థానం భూమికి నష్టం వాటిల్ల కుండా ఇటు అక్కడ చాలా కాలంగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో సమస్య పరిష్కారానికి త్వరలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.ఈసమస్య పరిష్కారానికి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి తన అధ్యక్షతన ఆజిల్లా మంత్రులు,ఎంపి,ఇద్దరు శాసన సభ్యులు,ప్రభుత్వ ముఖ్య సలహదారు అజయ్ కల్లాం,సిసిఎల్ఏ,జిల్లా కలక్టర్ తదితర సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు.ఈకమిటీ సమావేశం సోమవారం సచివాలయంలో నిర్వహించి ఈఅంశంపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదేశాల మేరకు దేవస్థానం భూమి విలువకు సమానమైన భూమిని దేవస్థానానికి ప్రభుత్వం బదలాయించేందుకు చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు వివరించారు.అదే విధంగా అక్కడ నివసించే ప్రజలంతా పేదవర్గాలకు చెందిన వారే కావున వారిని కూడా దృష్టిలో ఉంచుకుని ఈకమిటీ రెండు రోజుల్లో పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునే విధంగా తన నిర్ణయాన్నివెలువరించనుందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
అంతకు ముందు జరిగిన కమిటీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్ నాధ్,ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం,మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,ఎంఎల్ఏ అదీప్ రాజు,సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్,విశాఖ జిల్లా కలక్టర్ మల్లిఖార్జున,అదనపు సిసిఎల్ఏ ఇంతియాజ్,దేవాదాయ శాఖ కమీషనర్ హరిజవరిలాల్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment