ఏపీ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా గుర్తుండిపోతుంది.

 *- ఏపీ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా గుర్తుండిపోతుంది


 *- అన్యాయాన్ని ప్రశ్నించిన డోలాపై దాడి హేయం* 

 *- 75 ఏళ్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని ఖండిస్తున్నాం* 

 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* గుడివాడ మార్చి 20 (ప్రజా అమరావతి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ఏపీ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా గుర్తుండిపోతుందని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందన్నారు.  అసెంబ్లీ సాక్షిగా వైసిపి ఎమ్మెల్యేలు చెలరేగిపోయారన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన 

దళిత శాసన సభ్యుడు డోలా  బాలవీరాంజనేయ స్వామిపై జరిగిన దాడి హేయమైన చర్య అని అన్నారు. దళితుల ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై దాడి చేయించటం దుర్మార్గమన్నారు. జీవో నెంబర్ 1పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటం, అంగన్ వాడీల ఉద్యమాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ నీచానికి పాల్పడ్డారని విమర్శించారు. నాలుగు దశాబ్దాలుగా శాసనసభ్యుడుగా ఉన్న 75 ఏళ్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై కూడా వైసిపి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారన్నారు.

అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇటువంటి దురదృష్టకర  సంఘటనలు జరగలేదన్నారు. గతంలో సభలో ప్రవేశపెట్టిన అనేక బిల్లులు, అవిశ్వాస తీర్మానాలపై అధికార, ప్రతిపక్ష శాసనసభ్యుల మధ్య హోరా హోరీగా చర్చలు జరిగాయన్నారు. కొట్టుకున్న సందర్భాలను మాత్రం చూడలేదన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై జరిగిన దాడిని గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రావి తెలిపారు.

Comments