బడికి వెళ్తున్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న సంకల్పంతో జగనన్న గోరుముద్ద

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


బడికి వెళ్తున్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న సంకల్పంతో జగనన్న గోరుముద్ద


పేరుతో  రుచికరంగా రోజుకో మెనూ తీసుకురావడంతో పాటు చిన్నారులను మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు అదనంగా రాగి జావ అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 


జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర   ముఖ్యమంత్రి శ్రీ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు  మంగళవారం ఉదయం తాడేపల్లిలోని  తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా  లాంఛనంగా ప్రారంభించారు.  ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు మాట్లాడుతూ,  మధ్యాహ్నం భోజన పధకంలో ఇప్పటికే సమూల మార్పులు చేసి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం  అందించడంతో పాటు ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించి విద్యార్ధుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి 3 రోజుల పాటు బెల్లంతో కూడిన రాగి జావను విద్యార్ధులకు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.  ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో  భాగంగా కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో     జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహిధర్ రెడ్డి లతో కలసి జగనన్న గోరుముద్ద పధకం ద్వారా విద్యార్ధులకు రాగి జావ అందచేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులకు రాగి జావను పంపిణీ చేశారు. 


ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో  భాగంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి చేతుల మీదుగా  రాగి జావ పధకం ప్రారంభ కార్యక్రమంలో  పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందన్నారు. జగనన్న గోరుముద్ద పధకంలో భాగంగా   విద్యార్ధులకు రాగి జావ అందించడం ద్వారా విద్యార్ధుల్లో పోషకాహార లోపం మరియు రక్త హీనత లోపాన్ని  నివారించడానికి ఎంతో దోహద పడుతుందన్నారు.  రాగి జావ కార్యక్రమం ద్వారా జిల్లాలోని  2,590 పాఠశాలల్లో 1,81,327 మంది విద్యార్ధులకు  లబ్ధి చేకూరుతుందని చైర్ పర్సన్ శ్రీ అరుణమ్మ వివరించారు. 



జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు  మాట్లాడుతూ,     విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమ రంగాలను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు   విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని విద్య రంగంలో ఎన్నడూ లేనివిధంగా అనేక  మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. అందులో  భాగంగా  నాడు – నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచున్న విద్యార్ధుల ఆరోగ్యాన్ని  దృష్టిలో వుంచుకొని గోరుముద్ద కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు రోజు వారి మెనూలో మార్పు చేస్తూ  సంపూర్ణమైన పోషణ అందించేవిధంగా  మెనూను రూపొందించడం జరిగిందన్నారు.  ప్రతి రోజు మన జిల్లాలోని  2,590 పాటశాలల్లో 1, 81, 327 మంది విద్యార్ధులకు ఈ పధకం ద్వారా   లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమాల వలన  ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడం జరిగాయన్నారు. జిల్లాలో మరింతగా విద్యా రంగాన్ని అభివృద్ది చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద తీసుకొని కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమంలో విద్యార్ధులందరికి వారానికి మూడు రోజులు పాటు రాగి జావ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇస్కాన్  ట్రస్ట్, శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ ఈ సంధర్భంగా తెల్పడం జరిగింది.  ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్, విద్యార్ధులకు సూచించారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి గంగా భవాని, సమగ్ర శిక్ష ఆడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి, ఇస్కాన్ ట్రస్ట్ ప్రతినిధులు స్వామి చంద్రకేశవ దాస్, వివిధ పాఠశాలలకు  చెందిన విద్యార్ధులు తదితరులు  పాల్గొన్నారు.


Comments