భీమిలిలో ముమ్మరంగా మాజీ ఎమ్మెల్యే రావి ఎన్నికల ప్రచారం

 *- భీమిలిలో ముమ్మరంగా మాజీ ఎమ్మెల్యే రావి ఎన్నికల ప్రచారం* 


 *- అభ్యర్ధి వేపాడకు ఓటేయాలని వినతి* 

 *- బ్రహ్మరథం పడుతున్న ఉత్తరాంధ్ర పట్టభద్రులు* 

 *- భారీ మెజార్టీతో గెలుపు ఖచ్చితమన్న రావి*  భీమిలి / విశాఖ, మార్చి 4 (ప్రజా అమరావతి): ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా భీమిలి నియోజకవర్గంలో కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పరిశీలకుడు రావి వెంకటేశ్వరరావు శనివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భీమిలి టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆనందపురం మండలం తర్లవాడ గ్రామంలోని యలమర్తి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులను కలిశారు. వారితో సమావేశమై ఉత్తరాంధ్ర పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు ప్రథమ ప్రాధాన్యతా ఓటు వేసి గెల్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆనందపురం మండలం సిర్ల గ్రామంలోని జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై వేపాడను గెలిపించాలని కోరారు. బోని గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులతో మమేకమయ్యారు. గొట్టిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి వారి మద్దతు పొందగలిగారు. అలాగే 4వ డివిజన్లోని కే. నగరపాలెం, మంగమారిపేట గ్రామాల్లోనూ పర్యటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన వేపాడ చిరంజీవిరావు విజయాన్ని కాంక్షిస్తూ భీమిలి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. వేపాడకు ఉత్తరాంధ్ర పట్టభద్రులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేపాడ ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపారు. గత 25 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వేపాడ తన 12ఏళ్ళు ఉద్యోగ పదవీకాలాన్ని వదులుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థులకు వేపాడ మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయులతో మమేకమై ఉన్న వేపాడకు ఉపాధ్యాయుల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. నిరుద్యోగులకు ఏం కావాలో వేపాడకు తెలుసని అన్నారు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన వేపాడకు విద్యార్థులు, ఉపాధ్యాయుల మద్దతు ఉందన్నారు. జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. వేపాడను గెలిస్తే విద్యార్థి లోకానికి న్యాయం జరుగుతుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ కానున్నాయని తెలిపారు. ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని పట్టభద్రులందరినీ కలిసి వేపాడను గెల్పించాలని అభ్యర్ధిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులంతా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, వేపాడను గెల్పిస్తే ప్రతి ఒక్కరి గళాన్ని శాసనమండలిలో వినిపించే అవకాశం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రావి తెలిపారు.

Comments