ప్ర‌గ‌తికి పునాది రాళ్లు-యువ‌గ‌ళం మైలురాళ్లు

 ప్ర‌గ‌తికి పునాది రాళ్లు-యువ‌గ‌ళం మైలురాళ్లు


- నారా లోకేష్ పాద‌యాత్ర‌లో ప్ర‌తీ వంద కిలోమీట‌ర్లుకి ఒక మైలురాయి

- టిడిపి ప్ర‌భుత్వం వ‌చ్చే వంద రోజుల్లో ఇచ్చిన హామీలు పూర్తి

- అభివృద్ధి ప‌నులు, స‌మ‌స్య‌ల‌కి శాశ్వ‌త ప‌రిష్కారంగా లోకేష్ హామీలు

కదిరి (ప్రజా అమరావతి);

తెలుగుదేశం పార్టీ నినాదం స‌మాజ‌మే దేవాల‌యం-ప్ర‌జ‌లే దేవుళ్లు. ఇదే విధానం తెలుగుదేశం నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్ర‌బాబు వ‌ర‌కూ కొన‌సాగిస్తూనే ఉంది. టిడిపి పెద్ద‌ల అడుగుజాడ‌ల్లోనే యువ‌నేత‌, టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ న‌డుస్తున్నారు. మెజారిటీ ప్ర‌జ‌లకి మేలు చేకూర్చేలా ప్ర‌గ‌తి పనుల‌కు  పునాది రాళ్లుగా నిలుస్తున్నాయి యువ‌గ‌ళం మైలురాళ్లు. పాద‌యాత్ర‌లో ప్ర‌తీ వంద కిలోమీట‌ర్ల‌కి ఇస్తున్న హామీలు టిడిపి ప్ర‌భుత్వం వ‌చ్చే వంద రోజుల్లో నెర‌వేర్చేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. 

 యువ‌గ‌ళం పాద‌యాత్ర  47వ రోజున 600 కిలోమీట‌ర్ల‌కి చేరింది. ఈ సంద‌ర్భంగా శ్రీసత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలో చిన్న‌య‌ల్లంప‌ల్లి వ‌ద్ద‌ టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్ ఏర్పాటు చేస్తామని, టీడీపీ ప్ర‌భుత్వం రాగానే కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తామని లోకేష్ ప్ర‌క‌టించారు.  

 పాద‌యాత్ర ఆరంభించిన త‌రువాత‌ 100 కి.మీ మైలురాయి పూర్తి చేసుకున్న సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో డ‌యాల‌సిస్ కేంద్రాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని మాట‌ ఇచ్చారు. 200 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం కత్తెరపల్లి వద్ద డిగ్రీ కళాశాలకు ప్రభుత్వం రాగానే అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 300 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతీ పరిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే తాగునీటి ప‌థ‌కం ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. 400 కి.మీ చేరుకున్నసంద‌ర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండ‌లం న‌రేంద్ర‌కుంటలో ఆధునిక వ‌స‌తుల‌తో 10 ప‌డ‌క‌ల ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని ప్ర‌క‌టించారు. 500 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి నియోజకర్గంలోని చిన్నతిప్పసముద్రం -2 వద్ద టమోటా ప్రాసెస్ యూనిట్, కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలకు ప్రభుత్వం రాగానే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. టమోటా రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌కి ఇవి శాశ్వ‌త ప‌రిష్కారం చూప‌నున్నాయి. అలాగే ప్ర‌తీ హామీ కూడా స్థానికుల్లో అతి ఎక్కువ‌మందికి ప్ర‌యోజ‌న‌క‌రంగా, అంద‌రి స‌మ‌స్య‌కి ప‌రిష్కారంగా ఉండేలా చూస్తున్నారు లోకేష్‌.

Comments