సమాజ నిర్మాణం లో మహిళలే కీలకం – జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

 

వైవిధ్యంగా , వినూత్నంగా, మహిళా దినోత్సవ వేడుకలు

* సమాజ నిర్మాణం లో మహిళలే కీలకం – జిల్లా కలెక్టర్  సూర్య కుమారి


* మహిళలు తమ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాలి – ఎస్.పి దీపిక

* ఆడపిల్లల చదువుతో సమాజాన్నే మార్చవచ్చు-  ప్రముఖ వైద్యులు డా. సమీర్ నందన్

విజయనగరం, మార్చి  07 (ప్రజా అమరావతి):   జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  ఎప్పుడూ జరిగే వేడుకలకు భిన్నంగా  కొంత వైవిద్య్హంగా, వినూత్నంగా ఈ వేడుకలు నిర్వహించారు.  పట్టణ ప్రధాన కూడళ్ళ మీదుగా సుమారు 5 వేల  మహిళలతో మానవ హారంగా ఏర్పాటయ్యారు.  పెళ్లి వద్దు, విద్య ముద్దు , బాలికలను తల్లులుగా మార్చవద్దు  వంటి నినాదాలతో పెద్ద ఎత్తున బాల్య వివాహాల పై అవగాహన కలిగించారు.  మర్చి 8 హోలీ సందర్భంగా సెలవు కావడం తో, అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో  7వ తేదీనే వేడుకలను నిర్వహించారు. మానవహారంలో ఉదయం 8 గంటలకే పెద్ద ఎత్తున మహిళలు, బాలికలు హాజరు కాగా,  కలెక్టర్, ఎస్.పి ఓపెన్ టాప్ వాహనం పై ఆద్యంతం ప్రయాణిస్తూ ,  అందరిని పలకరిస్తూ  మహిళల్లో  స్ఫూర్తి నింపారు.  అనంతరం ఆనందగజపతి ఆడిటోరియం లో వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమంలో బాలికల విద్య ఆవశ్యకత, ఆరోగ్యం ,  కెరీర్ తదితర అమల పై వక్తలు అందించిన  సందేశాలను ఆసక్తి కలిగించాయి. బాలికను చదివిద్దాం , బాలికను రక్షిద్దాం  అనే అంశం పై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికీ బహుమతులను అందజేశారు. అదే విధంగా బాల్య వివాహాలను నిరోధించడం లో కృషి చేసిన వారికీ, సఖి సభ్యులకు  జ్ఞాపికలను అందజేశారు.  తొలుత ఆనంద గజపతిఆడిటోరియం వద్దనున్న తెలుగుతల్లి విగ్రహానికి కలెక్టర్, ఎస్.పి., జె.సి. పూలమాలలతో అలంకరించారు.  

సమాజ నిర్మాణం లో మహిళలే కీలకం – జిల్లా కలెక్టర్  సూర్య కుమారి

మహిళ అంటే చిన్న చూపు తగదని, సమాజ నిర్మాణం లో మహిళలదే  కీలక పాత్ర యని, చిన్న ప్రయత్నమే అయినా పెద్ద ఫలితాన్ని ఇస్తుందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి పేర్కొన్నారు.  పెళ్ళితోనే జీవితాలు బాగుపడతాయి అనే ఆలోచన మారాలని, అనుకోని పరిస్థితులు ఎదురైతే నిలదొక్కుకుని ఉండేందుకు విద్య మాత్రమే ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు భావించాలని అన్నారు. అమ్మాయిలు ఆత్మబలం తో ముందుకు వెళ్ళడానికి కావలసిన శక్తి చదువు వలన మాత్రమే లభిస్తుందన్నారు.  జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికే  ఈ మహిళా దినోత్సవాన్ని అందరిని భాగస్వామయం తో  చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరికీ పేరు పేరున అభినందనలని అన్నారు.  లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని, ఆడ, మగ వివక్ష వద్దని, ఇప్పటికే అమ్మాయిల శాతం తగ్గుతోందని, ఇది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా  జిల్లాలో నున్న 50 మంది మహిళా పారిశ్రామిక వేత్తల విజయగాధాలను ముద్రించిన పుస్తకాలను  కలెక్టర్, ఎస్.పి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వెబ్సైటు లో పెడుతున్నామని, ఈ స్ఫూర్తి తో  వచ్చే మహిళా దినోత్సవానికి  ఈ 50 మంది 500 మంది కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 

మహిళలు తమ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాలి – జిల్లా  ఎస్.పి దీపిక

మహిళలు తన కుటుంభ సభ్యుల  ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యత తన ఆరోగ్యానికి ఇవ్వడం లేదని, రోజులో  కొంత సమయాన్ని వారి కోసం కేటాయించుకోవాలని జిల్లా ఎస్.పి దీపిక తెలిపారు. చిన్న పిల్లల్ని భార్యలుగా మార్చవద్దనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అన్నారు. భార్యా భర్తల కేసులు తగ్గాలంటే మహిళలు తమ కాళ్ళ పై తాము బ్రతికే శక్తిని పొందాలన్నారు.   498 ఏ కేసు లలో 60 శాతం  వరకు మహిళలే నేరస్తులుగా ఉంటున్నారని, ఇది తగ్గాలని, మనం ఎదుట వాళ్ళని ఎలా చూస్తే మనల్ని అలాగే చూస్తారని అనుకోవాలని, మహిళల ప్రవర్తన ఒకరికి సహాయ పడే విధంగా ఉండాలని అన్నారు. 

ఆడపిల్లల చదువుతో సమాజాన్నే మార్చవచ్చు-  ప్రముఖ వైద్యులు డా. సమీర్ నందన్

 ప్రముఖ వైద్యులు డా. సమీర్ నందన్ మాట్లాడుతూ చదువు జీవితాన్ని నిలబెడుతుందని,  మహిళలకు గౌరవాన్ని తెచ్చి పెడుతుందని, ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కలిగిస్తుందని అందుకే చదువుకు పెద్ద పీట వేయాలని తెలిపారు.  చదువు ఒక కన్ను అయితే ఆరోగ్యం మరో కన్ను వంటిదని,  తల్లి బలంగా లేకపోతే పుట్టే బిడ్డలు బలహీనంగా పుడతారని, అందువల్ల సమాజమే బలహీనమౌతుందని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు.  బాలికలు చదువు, ఆరోగ్యం ఎంత ముఖ్యమో చిన్న చిన్న కథల  ద్వారా  అందరికీ అర్ధం అయ్యే రీతి లో సమీర్ నందన్ వివరించారు.  ఆరోగ్యంగా ఉంటె మనసు బాగుంటుందని, మనసు బాగుంటే చదువు  కూడా బాగుంటుందని, పిల్లలు ప్రతి రోజు కనీసం  40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలనీ , విటమిన్ డి లభించేలా ఎండ తగిలేల ఉండాలని అన్నారు.  ఏ పని నైనా అంకిత భావంతో చేస్తే  చేసే పని పూజ లా పవిత్రంగా  ఉంటుందని, అప్పుడే పనిలో సంతృప్తి లభిస్తుందని , సంతృప్తి చెందితే మనశాంతి  ఉంటుందని అన్నారు. 

సమానత్వం ఉండాలి :  జే.సి. మయూర్ అశోక్ 

ఈ  ఏడాది మహిళా దినోత వేడుకల భావం (థీం)  జెండర్ సమానత్వమని, ఈ ఉద్దేశ్యాన్ని అందరూ పాటించాలని, ప్రతి ఇంటి లో మహిళను పురుషులతో సమనగా చూడాలని అన్నారు. ఆడ, మగ పిల్లల్ని తేడాలు లేకుండా పెంచాలన్నారు.  సమన అవకాశాలను, విద్యనూ, నైపుణ్యాన్ని ఆడ పిల్లలకు ఇచ్చినప్పుడే  ఈ థీం ను ముందుకు సాధించగలమని అన్నారు. 

ఈ కార్యక్రమం లో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.పద్మ లీల పవర్ పాయింట్ ద్వారా సర్వికల్  కాన్సర్  ఎలా వస్తుంది, ఎలా గుర్తించాలి, ఎలా  నివారించుకోవాలి అనే అంశాల పై వివరించారు.  ఈ కాన్సర్ రాకుండా ఉండేందుకు 15 ఏళ్ళ  లోపు అమ్మాయిలకు హెచ్ పి వి వాక్సిన్ వేయించాలని , 21 సం.లు దాటినా మహిళలు తప్ప కుండా పరీక్షలు జరుపుకోవాలని అన్నారు.   

తాటిపూడి వద్ద గల సత్య సాయి దివ్యామృతం  కాన్సర్ ఆసుపత్రి లో ఉచితంగా కాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుందని డా. మహేష్, డా. సంతోష్ లు వివరించారు.   ఈ కార్యక్రమం లో  మున్సిపల్ కమీషనర్ శ్రీ రాములు  నాయుడు, ఐ.సి.డి.ఎస్., డి.ఆర్.డి.ఏ, మెప్మా  పి.డి. లు శాంత కుమారి, కళ్యాణ చక్రవర్తి, సుధాకర రావు, జిల్లా అధికారులు   పాల్గొన్నారు. 


Comments